ఫించన్ ఎపిసోడ్ లో తమ్ముళ్లకు మామూలు షాక్ తగల్లేదుగా?
దీనికి కారణం.. ఏదోలా ప్రభుత్వం మీద విరుచుకుపడాలి.
By: Tupaki Desk | 4 April 2024 5:39 AM GMTరాజకీయ వ్యూహాల్ని సిద్ధం చేయటం ఒక ఎత్తు. వాటిని సమర్థంగా అమలు చేయటం మరో ఎత్తు. ఈ విషయంలో తెలుగుదేశం వ్యూహకర్తలు తరచూ ఫెయిల్ అవుతుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. దీనికి కారణం.. ఏదోలా ప్రభుత్వం మీద విరుచుకుపడాలి. వారిపై ఒత్తిడి పెంచాలి. దాంతో వచ్చే మైలేజీతో మురిసిపోవాలనే తప్పించి.. తమకు మాత్రమే కాదు.. తమ రాజకీయ ప్రత్యర్థులకు సైతం తెలివితేటలు ఉంటాయని.. తమకు ఉన్నట్లే వారికి అవకాశాలు ఉంటాయన్న చిన్న లాజిక్ ను మిస్ అయ్యారని చెప్పాలి.
రూల్ బుక్ ప్రకారం ఫించన్లను ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇచ్చే వ్యవస్థను అడ్డుకోవటం ద్వారా ఏదో సాధిస్తామన్న లెక్కలు బొక్కబోర్లా పడటమే కాదు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. ఏదో ఒకటి హడావుడిగా చేసేయాలన్న తొందర తప్పించి.. వాటితో ఎదురయ్యే తలనొప్పుల మాటేమిటన్నది అస్సలు ఆలోచించట్లేదన్న అంశం అర్థమవుతుంది.
ఐదేళ్లుగా ప్రతి నెల ఫించన్ డబ్బులు ఠంచన్ గా అందే వేళ.. ఎన్నికల సందర్భంగా ఏదో కారణం చెప్పి అడ్డుకోవటం ద్వారా తమకు తిప్పలుగా మారుతాయన్న చిన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మిస్ అయ్యారని చెప్పాలి. పింఛన్ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాల్ని తెర మీదకు తీసుకొచ్చే సమయంలోనే దాని కారణంగా ఎదురయ్యే పరిస్థితులు ఏమిటన్న దానిపై తెలుగు తమ్ముళ్లు సరైన రీతిలో మదింపు చేయలేదనే చెప్పాలి.
ఫించన్ పంపిణీకి అడ్డుపడ్డారన్న అపప్రదను మూటగట్టుకున్నంతనే.. డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టినప్పటికి అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరిని నిందించాలన్నది తెలుగు తమ్ముళ్లకు.. నేతలకు అర్థం కాని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. తెలుగు తమ్ముళ్లు ఉమ్మడిగా పోరు చేయకుండా.. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అంశం అర్థమవుతుంది. ఇప్పటికే ఈ తీరును మార్చుకోకుండా రానున్న రోజుల్లో అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.