Begin typing your search above and press return to search.

రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేసి.. బ్యాగును మూలనపెట్టి ఘాతుకం!

దీంతో బెంగళూరుతోపాటు హైదరాబాద్‌ నగరంలోనూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

By:  Tupaki Desk   |   2 March 2024 5:53 AM GMT
రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేసి.. బ్యాగును మూలనపెట్టి ఘాతుకం!
X

బెంగళూరులోని ప్రముఖ కెఫేగా పేరున్న రామేశ్వరం కేఫ్‌ లో బాంబుపేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముందుగా కేఫ్‌ లో గ్యాస్‌ సిలిండర్‌ కు మంటల వల్ల పేలుడు సంభవించిందని అనుకోగా.. ఆ తర్వాత అది బాంబు పేలుడని నిర్ధారించారు. దీంతో బెంగళూరుతోపాటు హైదరాబాద్‌ నగరంలోనూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

కాగా ఈ బాంబుపేలుడుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా రామేశ్వరం కెఫే యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు వివరించారు. అనుమానితుడు తన బ్యాగును రెస్టారెంటులో ఉంచే ముందు.. అతడు రవ్వ ఇడ్లీ తీసుకోవడం చూశానని యజమాని దివ్య రాఘవేంద్రరావు వెల్లడించారు.

కేఫ్‌ లో పేలుడుకు ముందు జరిగిన అంశాల పరిణామ క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరించారు. పేలుడు జరిగినప్పుడు మొబైల్‌ ఫోన్‌ తన వద్ద లేదని చెప్పారు. ఆ తర్వాత దాన్ని తీసుకుని చూసుకోగా చాలా మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయన్నారు. ఆ తర్వాత తాను తమ సిబ్బందికి ఫోన్‌ చేస్తే వారు పేలుడు జరిగిందనే విషయం చెప్పారన్నారు.

ముందు వంటగదిలో గ్యాస్‌ లేదా ఏదైనా కారణంతో పేలుడు సంభవించిందని అనుకున్నానని యజమాని దివ్య రాఘవేంద్రరావు తెలిపారు. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవన్నారు. దీంతో వినియోగదార్లు ఉన్న ప్రాంతంలోనే పేలుడు జరిగిందని గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్‌ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేసినట్లు కనిపించిందన్నారు.

రవ్వ ఇడ్లీని ఆర్డర్‌ చేశాక అతడు ఒక మూలన కూర్చున్నాడని తెలిపారు. ఇడ్లీ తిన్నాక రెస్టారెంట్‌ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ ను ఒక మూలన ఉంచి వెళ్లాడన్నారు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించిందని వెల్లడించారు. ఆ సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ గ్యాస్‌ సిలిండర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ పేలుడులో ఎవరికి ఏమీ కాకపోవడం దేవుడి దయ అని పేర్కొన్నారు.

కేఫ్‌ కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోందన్నారు. రామేశ్వరం కేఫ్‌ ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మరింత పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.