అమ్మో మే ఫస్ట్ తారీఖు.. టీడీపీ వర్సెస్ వైసీపీ తయారు !
క్యాలెండర్ లో డేట్ మారితే ఎందుకు బాధ అంటే అక్కడే ఉంది పొలిటికల్ మ్యాజిక్ అంటున్నారు.
By: Tupaki Desk | 27 April 2024 2:45 AM GMTమే ఫస్ట్ తారీఖు అంటే టీడీపీ కూటమికి ఎందుకు ఫరాక్ అని ప్రశ్న తలెత్తుతుంది కదా. కానీ ఈ ఒక్క నెల మాత్రం గడిస్తే చాలు అన్నట్లుగా ఉంది. మే నెల ఒకటవ తేదీ మరో నాలుగు రోజులలో వచ్చేస్తోంది. ఆఘమేఘాల మీద వచ్చేస్తోంది.
క్యాలెండర్ లో డేట్ మారితే ఎందుకు బాధ అంటే అక్కడే ఉంది పొలిటికల్ మ్యాజిక్ అంటున్నారు. మే 1వ తేదీ నుంచి సామాజిక పెన్షన్లు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇతర వర్గలకు ఇవ్వాల్సి ఉంది. లక్షలలో వీరంతా ఉన్నారు. మే అంటేనే మంటెక్కించే నెల.
వేసవి ఎండలు పీక్స్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారిని తీసుకుని వచ్చి సచివాలయం చుట్టూ తిప్పితే అందులో ఎండ వేడిమి వడ దెబ్బ తట్టుకోలేక ఏ కొందరు అయినా గుటుక్కుమంటే ఆ పాపం శాపం అంతా టీడీపీ కూటమిదే అని అంటగట్టేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అంటున్నారు.
వాలంటీర్లు ఎంచక్కా ప్రతీ నెలా ఒకటవ తేదీ వేకువ జామునే ఇంటికి వచ్చి పెన్షన్ వృద్ధుల చేత్లో వికలాంగుల చేతిలో పెట్టేవారు అని ఇప్పటికే వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. వారిని కాదని ఈసీకి ఫిర్యాదు చేసి వృద్ధుల కొంప ముంచింది టీడీపీ కూటమి పెద్దలు అని విరుచుకుపడుతోంది.
ఏప్రిల్ నెలలో అయితే సామాజిక పెన్షన్ల పంపిణీ ఏకంగా వారం రోజుల పాటు సాగింది. అప్పటికి ఎండలు ఇంతల ముదరలేదు. అయినా ముప్పై నుంచి నలభై మంది దాకా వృద్ధులు చనిపోయారు అని దానికి టీడీపీ కూటమి బాధ్యత వహించాలని వైసీపీ తూటలు పేల్చింది. ఈసారి దాని కంటే ఎక్కువ ఎండలు రాబోతున్నాయి.
పైగా వడగాడ్పులు ఉన్నాయి. దాంతో ఈసారి వృద్ధులను తిప్పించకుండా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని చంద్రబాబు నుంచి సీపీఐ రామకృష్ణ దాకా అంతా కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభ నుంచి వినతి చేశారు.
మరి ఇంత మంది కోరుతున్నారు అంటే అందులో కచ్చితంగా మ్యాటర్ సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. మరి వృద్ధుల పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేసింది అన్నది వెల్లడి కావడంలేదు. గ్రామాలలో అయితే సచివాలయం ఉద్యోగులు ఉంటారు వారు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేయవచ్చు. కానీ వారిలో సగానికి పైగా ఇంకా చెప్పాలంటే ఎక్కువ మందినే ఎన్నికల విధులకు వాడుకుంటున్నారు.
వారి మీద చాలా పనులు కూడా ఇతరాత్రా ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు వారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి కూడా నో చెబుతున్నారు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. సచివాలయాలకే ఈసారి కూడా రప్పించుకుని ఒక వారం పాటు పెన్షన్లు ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈసారి రాజకీయ రచ్చ పీక్స్ లోనే ఉంటుందని అంటున్నారు.
ప్రభుత్వం ఏమి చేయాలో సూచించే అవకాశం ఉంటుంది కానీ ఇలాగే చేయాలని చెప్పలేరు కదా. ప్రభుత్వం తనకు ఉన్న వనరులను చూసుకుంటూ ఇస్తామని అంటే చేసేది లేదు. ఈ పరిస్థితుల్లో మే నేల పెన్షన్ గండం గట్టెక్కేది ఎలా అన్నదే కూటమికి ముందున అగ్గి లాంటి సవాల్ అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఒకవేళ ఇంటింటినీ పెన్షన్ పంపిణీ చేసినా అది ఒక్క రోజులో పూర్తి కాదు వారం దాకా పట్టవచ్చు. ఎందుకంటే యాభై ఇళ్లకు వాలంటీర్లు ఉన్నారు కానీ ఉద్యోగులు లేరు కదా అంటున్నారు. దాంతో ఆ విధంగా పెన్షన్ లేట్ అయితే దానికి టీడీపీ కూటమి కారణం అని చెప్పడానికి వైసీపీ కాచుకుని కూర్చుని ఉందని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే మాత్రం ఏపీలో సామాజిక పెన్షన్ లబ్దిదారులను అతి పెద్ద ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. వారితోనే మే నెల పాలిటిక్స్ మొదలవబోతోంది. అయితే తమాషా ఏంటి అంటే ఎన్నికల కోడ్ జూన్ 5 దాకా ఉంటుంది. అంటే జూన్ నెల కూడా పెన్షన్ ఇంటికే పంపిణీ చేయాలి. కానీ ఈ నెలలో డిమాండ్ చేసినట్లుగా ఆ నెలలో ఇంటికే పెన్షన్ అని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తాయా లేదా అన్నది కూడా చూడాలని అంటున్నారు. బహుశా చేయకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే మే 13తో ఎన్నికలు పూర్తి అవుతాయి. రాజకీయ పబ్బం కూడా ముగుస్తుంది అని సెటైర్లు పడుతున్నాయి.