Begin typing your search above and press return to search.

ఓరి నా దొంగ‌ ప్రేమ.. 3 కోట్ల‌తో ప్రియురాలి కోసం ఇల్లు

దొంగ‌లు ప‌లు ర‌కాలు. ఇంటి దొంగ‌లు, గ‌జ‌దొంగ‌లు, ఘ‌రానా దొంగ‌లు, దోపిడీ దొంగ‌లు.. వీళ్లలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్.

By:  Tupaki Desk   |   4 Feb 2025 5:20 PM GMT
ఓరి నా దొంగ‌ ప్రేమ.. 3 కోట్ల‌తో ప్రియురాలి కోసం ఇల్లు
X

దొంగ‌లు ప‌లు ర‌కాలు. ఇంటి దొంగ‌లు, గ‌జ‌దొంగ‌లు, ఘ‌రానా దొంగ‌లు, దోపిడీ దొంగ‌లు.. వీళ్లలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్. కానీ ఈ దొంగ వీళ్లంద‌రి కంటే భిన్న‌మైన‌వాడు. అత‌డు తాను దోచుకున్న సొమ్ముతో ప్రియురాలికి భారీ ఇల్లు క‌ట్టి ఇచ్చి త‌న ప్రేమ‌లో నిజాయితీని నిరూపించుకున్నాడు. ప్రియురాలి కోసం ఇత‌గాడి ద‌ర్జా దొంగత‌నం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది.

తాను దోచుకున్న డబ్బుతో తన ప్రియురాలి కోసం రూ.3 కోట్ల ఖ‌రీదైన‌ ఇల్లు కట్టించిన దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేయ‌డంతో అత‌డి నుంచి నిర్ఘాంత‌పోయే నిజాలు తెలిసాయి. అత‌డి దొంగ‌త‌నాల వెన‌క మోటో నిజంగా నోరెళ్ల‌బెట్టేలా ఉంది. నిందితుడిని 37 ఏళ్ల పంచాక్షరి స్వామిగా గుర్తించారు. అతనికి ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు వెల్లడించారు.

బెంగ‌ళూరు పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు పంచాక్షరి స్వామి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందినవాడు. వివాహితుడు. ఒక బిడ్డ ఉన్నా కానీ.. అమ్మాయిలకు వ‌ల‌లు వేసేందుకు అత‌డు ఎంత దూర‌మైనా వెళ‌తాడు. స్వామి 2003లో మైనర్‌గా ఉన్నప్పుడే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2009 నాటికి అతడు ఒక ప్రొఫెషనల్ దొంగగా మారాడు. తన నేరాల ద్వారా కోట్లాది రూపాయ‌ల‌ విలువైన సంపదను కూడబెట్టాడు. 2014-15లో అతడు ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరచుకుని ఆమెతో ప్రేమానుబంధాన్ని పెంచుకున్నాడు. పోలీసుల ఇంట‌రాగేష‌న్ లో నిందితుడు త‌న ప్రియురాలు అయిన‌ నటి కోసం కోట్లు ఖర్చు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడు కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇంటిని కూడా నిర్మించాడు. డార్లింగుకి రూ.22 లక్షల విలువైన అక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు.

2016లో పంచాక్ష‌రి స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి, ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత అతడు తిరిగి దొంగతనాలకు దిగాడు. తరువాత ఇలాంటి నేరాల కార‌ణంగానే మహారాష్ట్ర పోలీసులు కూడా అతడిని అరెస్టు చేశారు. 2024లో విడుదలైన తర్వాత అతడు తన స్థావరాన్ని బెంగళూరుకు మార్చాడు. అక్కడ అతడు తిరిగి ఇళ్ల‌లో దొంగతనాలు మొద‌లెట్టాడు. జనవరి 9న బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. నిఘా కెమెరాల నుంచి సేకరించిన వివ‌రాల‌తో.. పోలీసులు అతడిని మడివాలా మార్కెట్ ప్రాంతం సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో అతను తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చడానికి అతడు ఉపయోగించిన ఇనుప రాడ్- ఫైర్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఆభరణాలతో తయారు చేసిన బంగారు, వెండి బిస్కెట్లన్నింటినీ మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని తన నివాసంలో నిల్వ చేసినట్లు స్వామి వెల్లడించాడు. అధికారులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు, ఆభరణాలను కరిగించడానికి ఉపయోగించే ఫైర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత అనుమానం రాకుండా ఉండటానికి స్వామి రోడ్డుపై వెళుతూనే బట్టలు మార్చుకునేవాడని కూడా దర్యాప్తు అధికారులు వెల్ల‌డించారు.

వీట‌న్నిటినీ మించి అత‌డిలో వేరొక నిపుణుడు ఉన్నాడు. పంచాక్ష‌రి స్వామి కరాటేలో బ్లాక్ బెల్ట్ నిపుణుడు. అతడి తండ్రి మరణం తరువాత, తల్లి రైల్వే శాఖలో పరిహార ఉద్యోగం పొందింది. స్వామికి ఒక ఇల్లు ఉందని దర్యాప్తులో వెల్లడైంది. అది అతడి తల్లి పేరు మీద ఉంది. అయితే చెల్లించని రుణాల కారణంగా ఒక బ్యాంకు వేలం నోటీసు జారీ చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.