Begin typing your search above and press return to search.

రూపాయి దొరకలేదు.. గుడ్ బ్యాంక్.. కితాబు ఇచ్చిన దొంగ

ఎంత ప్రయత్నించినా ఒక్క రూపాయి కూడా దొరకని వేళ.. ఆ విషయాన్ని ఒక న్యూస్ పేపర్ మీద రాసి పరారైన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   2 Sept 2023 11:19 AM IST
రూపాయి దొరకలేదు.. గుడ్ బ్యాంక్.. కితాబు ఇచ్చిన దొంగ
X

బ్యాంక్ చోరీకి వచ్చిన దొంగ.. ఎంత ప్రయత్నించినా ఒక్క రూపాయి కూడా దొరకని వేళ.. ఆ విషయాన్ని ఒక న్యూస్ పేపర్ మీద రాసి పరారైన వైనం ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల జిల్లా నెన్నెలలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గురువారం రాత్రి చోరీకి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఈ సందర్భంగా చోరీకి ప్రయత్నించిన దొంగ.. తనకు ఒక్క రూపాయి కూడా దొరకలేదని.. గుడ్ బ్యాంక్ అంటూ కితాబు ఇచ్చి వెళ్లిపోయాడు. పనిలో పనిగా తనను పట్టుకోవద్దన్న రిక్వెస్టు కూడా పేపర్ మీద రాసేయటం గమనార్హం.

బ్యాంకు మొయిన్ డోర్ తాళాన్ని పగులకొట్టిన ఈ దొంగ.. మేనేజర్.. క్యాషియర్ కాబిన్ లను ఎంతలా ప్రయత్నం చేసినా.. చిల్లిగవ్వ దొరకలేదు. బ్యాంకులోని డబ్బులు మొత్తం లాకర్ లో పెట్టేసి ఉండటంతో చోరీకి వచ్చిన దొంగ తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి. దీనికి తోడు.. బ్యాంకు స్ట్రాంగ్ రూం ఎంత ప్రయత్నించినా తెరవలేకపోవటంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయాడు. తాను ఎంత ప్రయత్నించినా బ్యాంకు స్ట్రాంగ్ రూం తెరవలేకపోవటంతో నిరాశ పడ్డ అతను.. పేపర్ మీద "గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి దొరకలేదు.నేనేమీ దోచుకెళ్లపోయాను. నన్నుపట్టుకోవద్దు. నా ఫింగర్ ఫ్రింట్ కూడా ఉండదు" అంటూ రాసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

మేనేజర్ టేబుల్ మీద ఉన్న పేపర్ మీద రాసిన ఈ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు సీసీ కెమేరాలను పరిశీలించగా.. బ్యాంకు వెనుక వైపు గోడ దూకన దొంగ బ్యాంకు ఆవరణలోకి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ దొంగను పట్టుకోవటం కోసం పోలీసులు ప్రత్యేక టీంలు వేసి గాలిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.