Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టికి అసలు కారణం ఇదే!

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్ప పీడనాలే ఈ భారీ వర్షాలకు కార ణమని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 8:35 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టికి అసలు కారణం ఇదే!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం నగరాల్లో భారీ జడివానలు ప్రజలను అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే, ఓవైపు భారీ కుంభవృష్టితో కురిసిన వర్షాలకు తోడు వరదలు కూడా తోడవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.

ఈ భారీ కుంభవృష్టి కురియడానికి కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్ప పీడనాలే ఈ భారీ వర్షాలకు కార ణమని చెబుతున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 8 అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయని గుర్తు చ్తేస్తున్నారు. అందులోనూ ఈ వర్షాకాలం మొదలయ్యాకే జూన్‌ 28, జూలై 15, జూలై 19, సెప్టెంబర్‌ 5, 13, 23 తేదీల్లో వెంటవెంటనే 8 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాలతోపాటు మధ్యలో ఉన్న ప్రాంతాలు కూడా భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.

వాతావరణ మార్పులు, భూతాపం (భూమి వేడెక్కడం) వంటి పరిణామాలు భారీ కుంభవృష్టికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం వల్ల ఫసిఫిక్‌ మహాసముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రం వేడెక్కుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయని.. భారీ వర్షాలు పడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

వాస్తవానికి వర్షా కాలంలో, రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు సహజమే అయినప్పటికీ ఏదో ప్రకృతి పగబట్టినట్టుగా ఈ స్థాయిలో వర్షాలు పడటం అనేది అసాధారణమేనని చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో అల్పపీడనాలు వెంటవెంటనే ఏర్పడటం, అవి తీవ్ర రూపం దాల్పి వాయుగుండంగా, తుపాన్లుగా, తీవ్ర తుపాన్లుగా మారడం కూడా అసాధారణమేనని పేర్కొంటున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడుతున్న లానినో ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు తీవ్ర తుఫాన్లుగా మారుతున్నాయని అంటున్నారు.

భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఉత్తర భారతదేశంలోనూ బీభత్సంగా వర్షాలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతం మాత్రమే కాకుండా మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలకు, కుంభవృష్టికి పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడుతున్న తుపాన్లు కారణమని చెబుతున్నారు. ఈ తుపాన్లు వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్‌ మీదుగా పయనించి బలహీనపడుతున్నాయని వివరిస్తున్నారు. మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించి మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఈ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏర్పడ్డ ఎనిమిది అల్పపీడనాల్లో ఐదు వాయుగుండాలుగా మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమయ్యాయని చెబుతున్నారు.

తీరాలు కోతకు గురికావడంతో తుపాన్‌ తీరాన్ని తాకే ప్రాంతాలు మారిపోతున్నాయని అంటున్నారు. భూతాపం, తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుపాన్ల ఉధృతి మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

ఏప్రిల్‌-జులై, అక్టోబరు-నవంబరు సీజన్లలోనూ తుపాన్లు ఎక్కువగా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాల ఆరంభం అయ్యే జూన్, జులై నెలల్లోనే తుపాన్లు చెలరేగే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు.