మూడో విడత నామినేటెడ్ కు కౌంట్ డౌన్ ..వారంతా వెయిటింగ్
ఈ లిస్ట్ లో చాలా మంది సీనియర్లకు పదవులు దక్కవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది.
By: Tupaki Desk | 6 Dec 2024 12:30 AM GMTఏపీలో ఇప్పటికి రెండు విడతలుగా నామినేటెడ్ పదవుల లిస్ట్ ని రిలీజ్ చేశారు. ఇపుడు మరో జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది సీనియర్లకు పదవులు దక్కవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. దాంతో త్యాగరాజులు అనేకమంది ఆశతో ఉన్నారు.
ఈ లిస్ట్ లో ఈసారి పార్టీలో సీనియర్లకు స్థానం దక్కుతుందని అంటున్నారు. కేవలం టీడీపీ మాత్రమే కాదు జనసేన బీజేపీ నుంచి కూడా పలువురు ఆశావహులు ఈ పదవుల మీద ఫోకస్ పెట్టేశారు. దాంతో ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దాని మీద తీవ్ర స్థాయిలోనే కసరత్తు సాగుతోంది అని అంటున్నారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికి రెండు జబితాలలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసారు. తొలి జాబితాలో 21 మందికి చాన్స్ దక్కింది. రెండవ జాబితాలో 59 మందికి అవకాశాలు లభించాయి. అంటే వివిధ రకాలైన కార్పొరేషన్లకు చైర్మన్లు అలాగే డైరెక్టర్ల పదవులు భర్తీ చేశారు. ఇందులో టీడీపీకి సింహ భాగం దక్కితే ఆ తరువాత స్థానంలో జనసేన, బీజేపీ ఉన్నాయి.
ఇపుడు మూడో జాబితా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తాజాగా చంద్రబాబు నివాసానికి వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నామినేటెడ్ పోస్టుల గురించి చంద్రబాబు చర్చించారు అని అంటున్నారు. ఈ జాబితాలో గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసి ఎన్నికల్లో టికెట్ చాన్స్ దక్కకుండా పోయిన వారికి అవకాశాలు ఇస్తారని అంటున్నారు.
ఇక వారి విధేయతను పార్టీకి చేసిన సేవలను కూడా దృష్టిలో ఉంచుకుని వారితో పార్టీకి ఉన్న భవిష్యత్తు అవసరాలను కూడా బేరీజు వేసుకుంటూ ఈ పదవులను భర్తీ చేస్తారు అని అంటున్నారు. అలా చూస్తే కనుక చాలా పేర్లు ఊహాగానంగా చలామణీలో ఉన్నాయని అంటున్నారు.
అందులో మొదటి పేరు ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుది అని అంటున్నారు. ఆయన మైలవరం టికెట్ ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి ఇచ్చారు. దాంతో ఆయన పార్టీ మాటకు కట్టుబడి మరీ ప్రచారం చేసి విజయం కూడా సమకూర్చారు.
మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని అనుకున్నారు. ఇపుడు ఆయనకు తప్పకుండా అవకాశం ఇస్తారని మంచి పోస్టుకే ఆయనను ఎంపిక చేస్తారని అంటున్నారు. ఆ తరువాత ఇదే కృష్ణా జిల్లాకు చెందిన పశ్చిమ నియోజకవర్గం నేతలు నాగుల్ మీరా, బుద్ధా వెంకన్నలకు కూడా కీలక పదవులు దక్కుతాని ప్రచారం సాగుతోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఒక ముఖ్యమైన పదవిని ఇస్తారని అంటున్నారు. అలాగే యామినీ బాల పేరు కూడా పరిశీలనలో ఉంది.
ఇక పిఠాపురంలో జనసేనకు టికెట్ ఇచ్చినా తన శక్తి వంచన లేకుండా ఆ పార్టీ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎసీ ఎస్ ఎన్ వర్మకు కూడా ఈసారి కచ్చితంగా పదవి దక్కనుంది అని అంటున్నారు. అలాగే కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి వంటి వారికి ఈసారి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.
ఇక బీజేపీ నుంచి సూతే పాతూరి నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి వారు ఉన్నారు. జనసేనలో చూస్తే అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస యాదవ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇంకా అరవై దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ప్లానింగ్ కమిషన్ చైర్మన్, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వంటి కీలకమైన చైర్మన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇలా కీలక పోస్టులు కీలకమైన నాయకులు ఉన్నారు. ఎవరికి ఏ పదవి లభిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.