జనవరి 21 నుంచి 50 రోజుల జగన్ 'స్కెచ్` ఇదే!
ఇదేసమయంలో సమాంతరంగా పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను కూడా ఆయన పరిశీలిస్తున్నారు.
By: Tupaki Desk | 1 Jan 2024 3:15 AM GMTఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ను ప్రారంభించారు. ఇది.. జనవరి 10వ తేదీ నాటికి పూర్తిచేయనున్నట్టు పార్టీ కీలక నేతలు చెబుతున్నా రు. ఇదేసమయంలో సమాంతరంగా పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను కూడా ఆయన పరిశీలిస్తున్నారు.
మొత్తంగా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక క్రతువును జనవరి 15-20 మధ్యలో పూర్తి చేయనున్నారు. ఇక, ఎక్కడైనా సంక్లిష్ట స్తానాలు.. లేదా.. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత.. మార్పులు, చేర్పులు ఉంటే.. వాటిని తర్వాత నెల రోజుల్లో చేయనున్నారు. ఇతమిత్థంగా అయితే.. జనవరి 20 వ తేదీ నాటికి అభ్యర్థుల ఎంపికను మాత్రం పూర్తి చేయనున్నారు.
ఇక, ఈలోగానే.. ఇవ్వాల్సిని పథకాలు, చేయాల్సిన పనులను కూడా పూర్తి చేయాలని జగన్ నిర్ణయించు కున్నట్టు పార్టీ కీలక నాయకుడు ఒకరు తెలిపారు. ఫిబ్రవరి చివరి వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. ఇవి మార్చి 5 నుంచి 10 లోపు ఉంటాయి. ఇక, ఆ తర్వాత.. ఎన్నికల షెడ్యూల్ ఎలానూ రానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. జనవరి 21 నుంచి జగన్ పక్కా స్కెచ్‌తో ముందుకు సాగాలని నిర్ణయించారు.
జిల్లాల వారీగా పర్యటనలు, సభలు.. ప్రసంగాలతో దంచి కొట్టనున్నారు. గత ఎన్నికల్లో అయితే.. తల్లి చెల్లి ఇద్దరూ సమానంగా కష్టపడ్డారు. అయితే.. ఈ దఫా వారు దూరమైన నేపథ్యంలో అంతా జగన్‌పైనే భారం పడనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి కనీసంలో కనీసం 50 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా.. ప్రతిపక్షాల ప్రచారానికి దీటుగా జగన్ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారని... ఎక్కడా ఒక్క జిల్లా కూడా మిస్ కాకుండా.. ఆయన ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.