విన్నపాలు వినవలె... మోడీ ముందు రేవంత్, భట్టి పెట్టిన లిస్ట్ ఇదే!
ఇందులో భాగంగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 26 Dec 2023 2:37 PM GMTఅధికారంలోకి వచ్చినప్పటినుంచీ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించే విషయంలోనూ అదే ప్రదర్శించింది. ఇందులో భాగంగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారని తెలుస్తుంది.
అవును... తెలంగాణ రాష్ట్ర ఏర్పడి సుమారు పదేళ్లు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన దూకుడు ప్రదర్శిస్తొంది! ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి రావల్సిన నిధులు, బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించారని తెలుస్తుంది.
తాజాగా ప్రధానితో జరిగిన భేటీలో విభజన హామీకి సంబంధించిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా అడిగారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి వందల కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇందులో భాగంగా... హైదరాబాద్ మినహా నాటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు ఒక్కో జిల్లాకూ రూ. 50 కోట్ల చొప్పున రూ. 450 కోట్లు రావాల్సి ఉంది. అంటే... గత మూడేళ్లకు గానూ సుమారు రూ. 1,350 కోట్ల గ్రాంటు పెండింగ్ లో ఉంది. దీంతో ఈ విషయాని మోడీ వద్ద ప్రస్థావించిన రేవంత్... వీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా... ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో... అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా మొహించడం.. ఏపీ పరిధిలో ఉన్న గేట్ల వరకూ కంచె ఏర్పాటు చేయడం వంటి రచ్చ జరిగిన నేపథ్యంలో... కృష్ణా జలాల పంపకాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ఇదే క్రమంలో ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చిన మోడీ... పసుపుబోర్డు ఏర్పాటు, గిరిజన వర్శిటీకి హామీ ఇవ్వడంతోపాటు... మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తిస్తున్నామని తెలిపారు. దీంతో.... వీటి ఏర్పాటుపై కూడా రేవంత్, భట్టీ... మోడీతో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో... సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రస్థావించిన అంశాలన్నింటికీ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.