ఇదీ వైసీపీ లెక్క...పక్కాగా జగన్ వ్యూహం...!
అది ఆచరణలో ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం బూస్టింగ్ ఇచ్చేదిగా ఉంటోంది అన్నది వాస్తవం.
By: Tupaki Desk | 31 Dec 2023 7:48 PM GMTఏపీలో రెండవసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ చూస్తున్నారు. దాని కోసం ఆయన తన రాజెకీయ వ్యూహాలను పదును పెడుతున్నారు. మొత్తం 175 సీట్లను గెలుచుకుంటామని కూడా చెబుతున్నారు. వై నాట్ 175 అన్నది వైసీపీ స్లోగన్ గా ఉంది. అది ఆచరణలో ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం బూస్టింగ్ ఇచ్చేదిగా ఉంటోంది అన్నది వాస్తవం.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. దాంతో మొత్తం 175 సీట్లకు ఆ పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టే సువర్ణ అవకాశం చేతిలో ఉంచుకుంది. ఇందులో నుంచి ఇంచార్జిలను లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేర్పులు జగన్ చేస్తున్నారు. అయితే అది కేవలం మూడవ వంతు మాత్రమే.
అంటే మొత్తం 175లో యాభై నుంచి అరవై దాకా ఉండవచ్చు అని అంటున్నారు. ఈ లెక్కన తీసుకుంటే మిగిలిన 115 నుంచి 120 సీట్లలో పాతవారే పోటీ చేస్తారు అన్నది తెలిసిపోతోంది. మరి ఈ 120 మందిలో బలమైన వారే అభ్యర్ధులు కాబట్టే మార్చడంలేదు అంటున్నారు. ఇందులో నుంచి కచ్చితంగా సగానికి పైగా విజయం సాధించినా ఆ నంబర్ ఏ డెబ్బై నుంచి ఎనభై దాకానో ఉంటుంది.
ఇక బలహీనంగా అభ్యర్ధులు ఉన్నారు అన్న చోట మార్పు చేర్పులు చేస్తున్నారు. కొత్త ముఖాలను తీసుకుని వస్తున్నారు. సామాజిక సమీకరణలను కూడా సరి చూస్తున్నారు. దీంతో కనుక చూసుకుంటే ఈ మార్చిన అరవై మంది అభ్యర్ధులలో సగానికి పైగా మళ్లీ గెలిచేందుకు వీలు ఉంటుందని వైసీపీ పెద్దలు లెక్క వేసుకుంటున్నారు.
అంటే ఈ కొత్త ముఖాలలో ముప్పయి నుంచి నలభై మంది గెలిచినా మొత్తంగా చూస్తే 120 పై దాటి వైసీపీకి సీట్లు దక్కుతాయన్నది సింపుల్ లాజిక్ గా ఉంది. ఇక వైసీపీ ప్రభంజనమే మరోసారి వీస్తే కనుక ఆ నంబర్ గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లను కూడా దాటవచ్చు అన్నది మరో లెక్క. టోటల్ గా చూసుకుంటే వైసీపీ అధినాయకత్వం చేస్తున్న ఈ ప్రయోగం భారీ విజయాన్ని వైసీపీకి నమోదు చేయడానికే అని అంటున్నారు.
ఇపుడు బయటకు వస్తున్న అసంతృప్తులు అన్నీ చిన్నవని, ఏ పార్టీలోనైనా జరిగేవని అంటున్నారు. గెలుపు అవకాశాలు పార్టీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఎక్కువ మంది ఆశావహులు టికెట్ల కోసం పోటీకి వస్తున్నారు అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పడాన్ని ఈ సందర్భంగా గమనించాలి.
ఇక మరోవైపు చూస్తే వైసీపీ అభ్యర్ధుల జాబితాలో మార్పు చేర్పులతో కొత్త ముఖాలు సామాజికపరంగా అందరికీ అవకాశాలు వంటివి హైలెట్ అవుతాయని అవి ఎన్నికల్లో పార్టీ భారీ విజయానికి కూడా కారణం అవుతాయని కూడా అంచనా కడుతున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీ మార్పులకు ఒక లెక్క ఉందని, అది పక్కాగా టార్గెట్ ని కొట్టి తీరుతుందని ఆ పార్టీ పెద్దలు పూర్తి ఆశాభావంతో ఉన్నారు.