సిట్టింగులపై ఇక.. భూతద్దం పట్టాల్సిందే... వైసీపీ డెసిషన్ ఇది..
క్షేత్రస్థాయిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయకపోవడం.. అప్పట్లో టీడీపీ చేసిన ప్రథమ తప్పు.
By: Tupaki Desk | 4 Dec 2023 10:05 PM GMT''మీకేం ఢోకా లేదు. అందరికీ టికెట్లు ఖాయం'' అంటూ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం.. ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. మెజారిటీ స్థానాలు, గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని భావించిన స్థానాల్లోనూ బీఆర్ ఎస్ బక్కెట్ తన్నేసింది. కట్ చేస్తే.. అధికారంలో ఉన్న పార్టీలకు ఈ బెడద ఎప్పుడూ ఉంది. గత 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూడా ఇదే పొరపాటు చేసిందని అంటారు.
క్షేత్రస్థాయిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయకపోవడం.. అప్పట్లో టీడీపీ చేసిన ప్రథమ తప్పు. అంచనా వేసినా.. నన్ను చూసి గెలిపించండి.. మీ నాయకులు చేసిన తప్పులు నేను సరిచేస్తానని ప్రచారం చేయడం మరో తప్పు! ఈ రెండు తప్పుల ఫలితంగా అప్పట్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైం ది. ఇక, ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ సీన్ కనిపించింది. దీంతో వైసీపీ అలెర్ట్ అయింది. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు.
పనిచేసేవారికే.. ప్రజల్లో ఉన్నవారికే టికెట్లని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. బంధు ప్రీతి, ఒత్తిళ్లు, స్నేహాలు.. వంటివి క్షేత్రస్థాయిలో వైసీపీ అధిష్టానంపై బాగానే పనిచేస్తున్నాయి. దీంతో కొందరిని కాదనలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఇలాంటి బ్యాచే ఉన్నారు. కానీ, వీరిలో మరోసారి టికెట్ ఇస్తే ఎంత మంది గెలుపు గుర్రాలు ఎక్కుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రిజల్ట్ చూశాక.. వైసీపీ అలెర్ట్ అయింది.
మరింత లోతుగాసిట్టింగులపై సర్వేలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గెలిచే వారికే టికెట్లు ఇవ్వడంతోపాటు.. సిట్టింగులపై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రజల అభిప్రాయం మేరకు నాయకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తానికి తెలంగాణ ఫలితంతో ముందుగానే మేల్కొన్నా.. దీనిని ఎంతవరకు పక్కాగా అమలు చేస్తారనేది చూడాలి. ఏదేమైనా.. సిట్టింగులపై వ్యతిరేకతను అధిగమించాల్సిన అవసరం వైసీపీ ఉంది.