ఈ నేత రూటే సపరేటు.. నిన్న షర్మిలతో, నేడు పవన్ తో!
తాజాగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ నేతగా పేరున్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 24 Jan 2024 1:35 PM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముంగిట రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆయా పార్టీలకు నేతల రాజీనామాలు, వేరే పార్టీల్లో చేరికలు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ నేతగా పేరున్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
నిన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొణతాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. మళ్లీ ఇంతలోనే ఒక్క రోజు గడిచేసరికి కొణతాల రామకృష్ణ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా తాను జనసేన పార్టీలో చేరుతున్నానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని కొణతాల స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ గురించి చర్చించడానికి పవన్ కళ్యాణ్ ను కలిశానని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర రాజకీయాలు, అభివృద్ధిపై ఆయనతో చర్చించానని వెల్లడించారు.
కాగా కొణతాల రామకృష్ణ గవర సామాజికవర్గానికి చెందినవారు. అనకాపల్లిలో ఈ సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉన్నారు. కొణతాల తొలిసారి 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి 9 ఓట్ల తేడాతో గెలిచారు. 1991లో మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు.
1999లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొణతాల టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ తరఫున గెలుపొంది వైఎస్సార్ మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో కొణతాల ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరఫున కొణతాల తనయుడు కొణతాల రఘునాథ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి కొణతాల రాజీనామా చేశారు.