ఈసారి రెడ్లకు తక్కువ నంబర్...వైసీపీలో హాట్ టాపిక్...!?
బహుశా వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉండడం వల్ల అని అనుకోవాలి.
By: Tupaki Desk | 31 Dec 2023 11:30 PM GMTఏపీ అంటేనే రాజకీయ సంకుల సమరం. ఇక రాజకీయ పార్టీలను కూడా అలాగే చూస్తారు. అది ఈనాటిది కాదు ఉమ్మడి ఏపీకి ఉన్నంత చరిత్ర ఈ కులాల రాజకీయానికీ ఉంది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని పేరు ఎందుకో అలా వచ్చేసింది. బహుశా వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉండడం వల్ల అని అనుకోవాలి. ఇక 1982లో టీడీపీ పెట్టాక ఆ పార్టీకి కమ్మ ముద్ర పడిపోయింది.
కాంగ్రెస్ జమానా విభజన ఏపీలో బాగా తగ్గిపోయాక వైసీపీ అవతరించాక ఆ పార్టీలో రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని అంతా అనుకున్నారు. కొన్ని సార్లు చూస్తే అలాగే అనిపించింది. ఇక 2019 నాటికి ఉన్న లెక్కలు చూస్తే మొత్తం వైసీపీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 50 దాకా ఎమ్మెల్యేలు రెడ్డి లకు చెందిన వారు ఉన్నారు అని ప్రచారం జరిగింది.
ఇక ఇపుడు చూస్తే అంటే 2024 ఎన్నికలలో జగన్ ఒక పద్ధతి ప్రకారం టికెట్లు ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. ఆ విధానం లెక్కలు చూస్తూంటే కనుక మొత్తం 175 ఎమ్మెల్సీ సీట్లలో సిం హ భాగం అంటే అత్యధికంగా 85 నుంచి 90 దాకా సీట్లు ఈసారి బీసీలకు జగన్ ఇవ్వబోతున్నారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
అదే విధంగా చూసుకుంటే ఎస్సీ లకు 29 సీట్లు, ఎస్టీలకు ఏడు సీట్లు ఇస్తారని అంటున్నారు. ఈ మొత్తం నంబర్ చూస్తే 125 దాకా ఉండబోతోంది. అంటే ఏతా వాతా చూసుకుంటే ఇక మిగిలేవి యాభై సీట్లు మాత్రమే. ఇందులో నుంచి మిగిలిన అన్ని కులాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంటున్నారు
ఈ సీట్లలోనే రెడ్డీ లకు, కమ్మలకు అలాగే బ్రాహ్మిణలకు , క్షత్రియులు, వైశ్యులు, కాపులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం ఏపీ రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి సామాజిక విప్లవాన్ని అంతా చూడబోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఇదే టైం లో మొట్టమొదటిసారి రెడ్డీ లకు అతి తక్కువ సీట్లు కూడా దక్కబోతున్నాయని అంటున్నారు
స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయంగా అగ్రభాగాన ఉంటూ గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా ఉమ్మడి ఏపీ విభజన ఏపీ రాజకీయాలు శాసిస్తూ వస్తున్న రెడ్డి లకు ఇంత తక్కువ సీట్లు దక్కడం మాత్రం చరిత్రలో ఎన్నడూ లేదనే అంటున్నారు.
అదే సమయంలో బీసీలకు చట్ట సభలలో యాభై శాతం పైగా రిజర్వేషన్లు ఉండాలని ఒక రాజకీయ నినాదం ఉంది. కానీ దాని కంటే ఎక్కువ నంబర్ సీట్లను వైసీపీ ఇవ్వడం ద్వారా వారికి పూర్తి న్యాయం చేసిన ఘనతను సొంతం చేసుకునే ప్రయత్నం చేయబోతోంది అని అంటున్నారు.
కేవలం యాభై కాదు డెబ్బై శాతానికి పైగా సీట్లను చట్ట సభలలో బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇతర వర్గాలకు ఇవ్వడం ద్వారా జగన్ ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయబోతున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
సరే ప్రచారంలో ఉన్న ఈ వార్తలే నిజం అనుకుంటే మాత్రం దీని వల్ల రాజకీయ లాభాలు ఏమిటి అలాగే ఇబ్బందులు ఏంటి అన్నది మాత్రం ఎన్నికల ఫలితాలే తరువాతనే తెలుస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా మాత్రం ఈసారి ఒక ప్రధాన సామాజిక వర్గానికి అతి తక్కువ సీట్లు వైసీపీలో దక్కబోతున్నాయన్నది మాత్రం ప్రచారంగా బయటకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.