Begin typing your search above and press return to search.

ఈసారి బర్రెలక్క పోటీ ఇక్కడి నుంచే!

రాజకీయాల్లో వస్తున్న మార్పుకు, యువతరం ఆలోచనలకు బర్రెలక్క పోటీ ఊతమిస్తుందని సర్వత్రా ఆమెపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 2:56 PM GMT
ఈసారి బర్రెలక్క పోటీ ఇక్కడి నుంచే!
X

బర్రెలక్క.. పరిచయం అక్కర్లేని పేరు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా బర్రెలక్క పాపులర్‌ అయ్యారు. రాజకీయాల్లో వస్తున్న మార్పుకు, యువతరం ఆలోచనలకు బర్రెలక్క పోటీ ఊతమిస్తుందని సర్వత్రా ఆమెపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమెకు ఎంతో మంది స్వచ్ఛంధంగా ఆర్థిక సాయం అందించారు. నైతిక మద్దతు తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా బర్రెలక్క తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మరో మూడు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని నాగర్‌ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని బర్రెలక్క తెలిపారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానన్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు ఏదో ఒక ఎన్నికలో పోటీ చేస్తూనే ఉంటానని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బాధపడ్డానని.. అయితే కుంగిపోనని బర్రెలక్క తెలిపారు. అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలిచే వరకు ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు. నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరని.. ఈ ప్రపంచానికి నిరూపిస్తానని బర్రెలక్క ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిపిస్తారనే ఆశతో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని బర్రెలక్క అభ్యర్థించారు. ఒక నిరుద్యోగి అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఉండాలంటే తనను గెలిపించాలని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. చాలా మంది డబ్బులు చూసి ఓటేస్తున్నారని.. మంచిని చూసి ఓటేయాలని విన్నవించారు.

తల్లిదండ్రులందరూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూతురులాంటి తనకు మద్దతివ్వాలని, అండగా నిలవాలని బర్రెలక్క పిలుపునిచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. తనను గెలిపిస్తే నిరుద్యోగుల తరఫున గళం ఎత్తుతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలంటే నాయకులు భయపడేలా చేస్తానని బర్రెలక్క తెలిపారు. ఒక్కసారి తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు.