Begin typing your search above and press return to search.

రిపోర్టు: అదే అమ్మాయిల్ని ఆఫీసులకు వెళ్లకుండా ఆపేస్తుందట

పెళ్లైన తర్వాత జాబ్ కు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఉద్యోగం చేయాలనుకునే వారిని ఇబ్బంది పెడుతున్న కారణాల మీద ఫోకస్ పెట్టారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:58 AM GMT
రిపోర్టు: అదే అమ్మాయిల్ని ఆఫీసులకు వెళ్లకుండా ఆపేస్తుందట
X

పెళ్లైన తర్వాత ఉద్యోగాలకు వెళ్లనివ్వకుండా చేస్తున్న పరిణామాల గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది నౌక్రీ.కామ్ రిపోర్టు. ప్రముఖ జాబ్ పోర్టల్ గా పేరున్న నౌక్రీ.కామ్ తాజాగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ఫోకస్ పెట్టింది. ఓవైపు కుటుంబ బాధ్యతలు. మరోవైపు జాబ్. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవటం సవాలుగా మారినట్లుగా చెబుతున్నారు. పెళ్లైన తర్వాత జాబ్ కు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఉద్యోగం చేయాలనుకునే వారిని ఇబ్బంది పెడుతున్న కారణాల మీద ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇటీవల చేపట్టిన సర్వే వివరాల్ని వెల్లడించారు. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

సర్వేలో పాల్గొన్న మహిళల్లో 39 శాతం మంది మహిళలు.. ఇల్లు/ఆఫీసు మధ్య బాధ్యతల్ని కోఆర్డినేషన్ చేసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా జాబ్ ను వదిలేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగ నిర్వహణకు సంబంధించి అనుకూలమైన పని వేళలు లేకపోవటంతో 49 శాతం మంది తాము మళ్లీ జాబ్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. కుటుంబ బాధ్యతల కారణంగా జాబ్ చేయటం కష్టంగా మారినట్లుగా 35 శాతం మంది చెప్పగా.. ఒకేలాంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ పురుషులతో పోలిస్తే తమకు అవకాశాలు తక్కువగా ఉన్నట్లు 24 శాతం మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 8 శాతం మంది పురుషులు ఏకీభవించటం గమనార్హం.

ఈ వాదనకు భిన్నంగా మహిళలకే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయని 13 శాతం మంది పురుషులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. వారి వాదనను 3 శాతం మంది మహిళలు ఏకీభించారు. పని ప్రదేశాల్లో లింగ సమానత్వం ఉందన్న విషయాన్ని 73 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు పని ప్రదేశంలో మహిళలకు సమాన అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

అయితే.. జీతం విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ జీతాలకే పని చేస్తున్నట్లు 31 శాతం మంది పేర్కొనటం గమనార్హం. దీనికి భిన్నంగా 53 శాతం మంది అమ్మాయిలు మాత్రం తాము ఎలాంటి తేడాలు లేకుండా.. పురుషులతో సమానంగానే జీతాలు పొందుతున్నట్లుగా పేర్కొనటం విశేషం.