Begin typing your search above and press return to search.

తీర్పు రాలేదు.. వినేశ్ రజతంపై కీలక వ్యాఖ్యలు

వినేశ్ ఎపిసోడ్ పై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్.. వినేశ్ ఫొగాట్ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేస్తూ..

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:49 AM GMT
తీర్పు రాలేదు.. వినేశ్ రజతంపై కీలక వ్యాఖ్యలు
X

నిర్ణీత బరువుకు అక్షరాల వంద గ్రాములు అధికంగా ఉన్న కారణంగా పారిస్ ఒలింపిక్ రెజ్లింగ్ పోటీలో అనర్హత వేటు పడిన వినేశ్ పొగాట్ ఫ్యూచర్ ఏంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తనకు ఎదురైన షాకింగ్ అనుభవంతో ఆటకు గుడ్ బై చెప్పేసిన ఆమె.. తీవ్రమైన నిరాశ.. నిస్ప్రహలోకి చిక్కుకోవటం తెలిసిందే. మరోవైపు.. తనకు పతకం ఇవ్వని వైనంతో పాటు.. అనర్హత వేటు మీద ఆమె సవాలు చేస్తూ స్పోర్ట్స్ కోర్టులో కేసు వేయటం తెలిసిందే.

సాధారణంగా ఇలాంటి కేసుల విచారణ.. తీర్పు రెండూ 24 గంటలు లేదంటే కాస్తంత ఎక్కువ సమయం తీసుకుంటారు. తాజా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తీర్పు సానుకూలంగా వస్తే రజతపతకాన్నిఇస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. వినేశ్ ఎపిసోడ్ పై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్.. వినేశ్ ఫొగాట్ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేస్తూ.. రూల్ ప్రకారం ఈ ఈవెంట్ లో రెండు రజత పతకాలు ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు.

ప్రస్తుతం కాస్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారం మొత్తం మానవతా కోణానికి సంబంధించిందని.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. కాస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దాన్ని అమలు చేస్తామన్నారు. మరి.. రెండు రజత పతకాల్ని ఇస్తారా? అన్న ప్రశ్నకు.. అలాంటి వాటికి రూల్స్ ఒప్పుకోవని స్పష్టం చేశారు.

ఆట గురించి అవగాహన లేని వారికి.. బయట ఉన్న వారికి వంద గ్రాముల బరువు చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించినా.. సెకనులో వెయ్యో వంతును కూడా పరిగణలోకి తీసుకునే ట్రాక్ ఈవెంట్లలో ఇది ఆమోదయోగ్యమేనా? అని థామస్ ప్రశ్నించటం గమనార్హం. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనల్ని.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ లు తదుపరి నిర్ణయాల్ని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మొత్తంగా కోర్టులో వేసిన కేసుకు సంబంధించి వినేశ్ కు సానుకూలంగా తీర్పు వచ్చినా.. సానుభూతి మాత్రమే తప్పించి రజత పతకం లభించే అవకాశం లేదన్న క్లారిటీ తాజా వ్యాఖ్యలతో వచ్చేసిందని చెప్పాలి.