ఆ ఎమ్మెల్యేల మీద వేటు పడింది... విభజన ఏపీలో సంచలనం !
ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2024 4:03 AM GMTఉమ్మడి ఏపీలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల చరిత్ర ఉంది. విభజన ఏపీలో మాత్రం ఇదే తొలిసారి అని అంటున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఒక సంచలన నిర్ణయం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చాంబర్ నుంచి వెలువడింది. ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో సగం మంది టీడీపీ వారు అయితే మరో సగం మంది వైసీపీ వారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి.
ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్యేలు వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి ఏడాది క్రితం వచ్చారు. అయితే స్పీకర్ ఇపుడే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని డౌట్ రావచ్చు. వీరి మీద చర్యలు కోరుతూ ఆయా పార్టీలు ఫిర్యాదు చేసింది ఇటీవల కాలంలోనే. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ఈ అనర్హత కత్తి వేలాడింది.
దీని మీద స్పీకర్ పలుమార్లు ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పిలిచి వివరణ కోరారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే వచ్చి తమ వైపు నుంచి వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి చూస్తే ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసిందని స్పీకర్ ఆఫీస్ ప్రకటించింది.
ఆ మీదట పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అనంతరం ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు. దీంతో మరి కొద్ది రోజులలో ముగియబోతున్న ఏపీ అసెంబ్లీలో ఎనిమిది మంది మీద వేటు మాత్రం ఆసక్తిని రేపింది.
విభజన ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో లాగేసుకుంది. దీని మీద వైసీపీ అప్పట్లో ఫిర్యాదు చేసినా నాడు ఎటువంటి చర్యలూ లేవు. దాని ఫలితాన్ని 2019 ఎన్నికల్లో టీడీపీ అనుభవించింది. ఇపుడు కూడా లేట్ బాగా అయింది. అయినా సరే ఎట్టకేలకు వేటు వేయడం చట్ట సభలను ప్రజాస్వామిక విలువలను కాపాడడమే అని మేధావులు అంటున్నారు
ఇలా బాగా నానబెట్టి ఎన్నికల ముందు నిర్ణయాలు కాకుండా పార్టీ మారిన వెంటనే వేటు వేసే విధానం ఆ వేగవంతమైన చర్యలు వస్తేనే తప్ప ఈ గోడ దూకుళ్ళు కప్పదాట్లూ ఆగవని అంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ స్పీకర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు
ఇక శాసనమండలిలో కూడా వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్సీలు విపక్ష కూటమిలోకి వెళ్లారు. వారిని అనర్హులను చేయమని వైసీపీ ఫిర్యాదు చేసింది. దాని మీద విచారణ జరిగింది. మరి ఆ నిర్ణయం కూడా తొందరలో వెలువడితే జనసేనలోకి వెళ్ళిన వంశీ క్రిష్ణ, అలాగే టీడీపీలోకి వెళ్ళిన సి రామచంద్రయ్య వంటి వారి మీద యాక్షన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.