జనసేనకు ఆ రెండు టికెట్లు కన్ఫర్మ్!
అయితే.. ఇంతలోనే రెండు నియోజకవర్గాల్లో టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు.. ఇటు టీడీపీలోను, అటు జనసేనలోనూ చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 1 Dec 2023 6:44 AM GMTఏపీలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై డిసెంబరు తొలి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. టీడీపీ-జనసేన సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్రమంలో టికెట్లపై ఒక క్లారిటీకి రానున్నట్టు సమాచారం. అయితే.. ఇంతలోనే రెండు నియోజకవర్గాల్లో టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు.. ఇటు టీడీపీలోను, అటు జనసేనలోనూ చర్చ సాగుతోంది.
తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయు డు ఆరెండు నియోజకవర్గాలపై సమీక్ష చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇతర నియోజకవర్గాలపై మాత్రమే మాట్లాడాలని తేల్చి చెప్పారు. వాటిలో టీడీపీకి ఉన్న బలం ఎంత.. ఇతర నియోజకవర్గాల్లో జనసేన బలం ఎంతో గుర్తించాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాలు జనసేనకు కన్ఫర్మ్ అయినట్టుగా టీడీపీ సీనియర్లు మీడియా ముందు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.
వీటిలో ఒకటి చీరాల నియోజకవర్గం. రెండో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గా లపైనా.. టీడీపీ సమీక్ష చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై నా టీడీపీ సమీక్షలు చేస్తోంది.దీనిలో భాగంగా.. తాజాగా సమీక్ష నిర్వహించారు. కానీ, చీరాల, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఈరెండు నియోజకవర్గాలు కూడా జనసేనకు ఇచ్చే ఆలోచనతో ఇలా చేశారా? అనే చర్చ సాగుతోంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ జనసేన తరఫున ఉన్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే.. వైసీపీ అభ్యర్థి.. వెలంపల్లి శ్రీనివాసరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పోతిన కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఈ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది.
ఇక, చీరాల నియోజకవర్గం టికెట్‌ను.. కొన్నాళ్ల కిందట జనసేనలోకి చేరిన ఆమంచి స్వాములుకు కేటాయిస్తారనే ప్రచారం ఉంది. 2019లో టీడీపీ తరఫున ఇక్కడ గెలిచిన కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఇక, జనసేన తరఫున స్వాములు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయనకే ఈ టికెట్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఆ రెండు నియోజకవర్గాలను వదిలేసిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.