Begin typing your search above and press return to search.

వైసీపీలో ఉంటూనే...త్రిమూర్తుల లెక్కే వేరు !

ఈ క్రమంలో తోట త్రిమూర్తులు తనదైన కొత్త రాజకీయానికి తెర తీశారా అన్న చర్చ వస్తోంది. కాపులకు పెద్దన్న పాత్రను పోషించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 4:04 AM GMT
వైసీపీలో ఉంటూనే...త్రిమూర్తుల లెక్కే వేరు !
X

ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వారు తోట త్రిమూర్తులు ఆ మీదట ఆయన అలా గెలుస్తూ ఓడుతూ ముందుకు సాగుతున్నారు. పార్టీలు కూడా ఆయన మార్చడం ఆయన రాజకీయ వ్యూహాలలో భాగమే. టీడీపీ కాంగ్రెస్, వైసీపీ ఇలా పార్టీ ఏది అయినా తోట త్రిముర్తులు లెక్క వేరుగా ఉంటుందని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఇంతటి సీనియర్ మోస్ట్ లీడర్ కి ఈ రోజుకీ మంత్రి పదవి అయితే దక్కలేదు. అది ఆయనకు కూడా వెలితిగా ఉంది. టీడీపీలో 2014లో గెలిచినా మంత్రి కాలేకపోయారు. ఆ మీదట వైసీపీలో 2019లో చేరి ఎమ్మెల్సీగా నెగ్గినా మంత్రి చాన్స్ అయితే జగన్ ఇవ్వలేదు.

ఇక 2024 ఎన్నికల్లో త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూసారు. ఆయన పార్టీ మారుతారు అని ఆ మధ్యన వినిపించినా రాజకీయ సమీకరణలు అయితే సరిపోవడం లేదు అని అంటున్నారు. ఇక శాసన మండలిలో చూస్తే ఇప్పటికే రాజీనామాలు చేసిన వారికే ఆమోద ముద్ర పడలేదు.

ఈ క్రమంలో తోట త్రిమూర్తులు తనదైన కొత్త రాజకీయానికి తెర తీశారా అన్న చర్చ వస్తోంది. కాపులకు పెద్దన్న పాత్రను పోషించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంటున్నారు. లేటెస్ట్ గా కార్తీక వన సమారాధనలో ఆయన చేసిన కామెంట్స్ దీనిని ఉదాహరణ అంటున్నారు.

రెడ్లలో కమ్మలలో ఉన్న ఐక్యత కాపులలో లేదని తన సొంత సామాజిక వర్గాన్ని ఆయన కాసింత దిశా నిర్దేశం చేసే తీరులోనే ఈ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. రెడ్లు కాపులు తమ వారి బాగు కోరుకుంటే కాపులు మాత్రం ఎవరు బాగు పడినా చూడలేరన్నట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి.

ఇక చూస్తే గోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు కులం ప్రాబల్యం తెలిసిందే. ప్రస్తుతం ఆ సామాజిక వర్గం ఎక్కువగా జనసేన సైడ్ తీసుకుంది. అందుకే వచ్చే ఎన్నికలను తన రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని తోట త్రిమూర్తులు కాపుల విషయంలో అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.తాను ఉన్న వైసీపీ కంటే తన కులమే తనను రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్తుందని ఆయన భావిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే 2019,2024 మధ్యలో కూడా కాపు సమావేశాలు విశాఖ విజయవాడ, హైదరాబాద్ లలో జరిగితే వాటికి పార్టీలకు అతీతంగా తోట త్రిమూర్తులు హాజరైన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఆయనతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వంగవీటి రంగా జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు కూడా కాపు నేతలు అప్పట్లో నిర్వహించి ఏపీలో కొత్త పార్టీ రావాలని కొంత మధనం చేశారు.

అయితే ఆ తరువాత జనసేన పుంజుకోవడంతో పాటు పరిస్థితులు అన్నీ మారడంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక ఇపుడు పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని మరో మారు కుల ఐక్యతకు కాపుల సమావేశాలు కీలక భేటీలకు తోట త్రిమూర్తులు తెర తీస్తారని అంటున్నారు. కాపులలో బలాన్ని పెంచుకుంటే రేపటి రోజున రాజకీయ ఎలా ఉన్నా తన వరకూ సేఫ్ గా ఉంటుంది అన్నదే ఆయన ఆలోచన అని అంటున్నారు. వైసీపీలో ఉన్నా తోట తన రాజకీయ బాటను సొంతంగా వేసుకునేందుకే చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఆయన రాజకీయ లెక్కలు సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయో.