పార్టీ కాదు. కులమే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్సీ..?
ఇప్పుడేం ఎన్నికలు లేవు .. అలాంటప్పుడు తోట కాపు కులాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ? ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
By: Tupaki Desk | 27 Dec 2024 11:30 AM GMTతోట త్రిమూర్తులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బలమైన కాపు నేత. దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేకుండా ఆయన రాజకీయాలకు చేస్తూ వస్తున్నారు. గతంలో రామచంద్రపురం నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి.. అలాగే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారిగా పోటీచేసి ఓడిపోయారు. తోట త్రిమూర్తులకు కాపు సామాజిక వర్గంలో మంచిపట్టు ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే మొదట నుంచి కూడా రాజకీయం కంటే కూడా తనకు కులమే ముఖ్యం అన్నట్టుగా తోట త్రిమూర్తులు వ్యవహరిస్తూ ఉంటారన్న మాట ఉంది.
మొన్న ఎన్నికల్లో మండపేట నుంచి అయిష్టంగానే పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు ఇప్పుడు రాజకీయంగా కంటే కుల పరంగా మరింత బలంగా ఎదగాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో తోట త్రిమూర్తులను ఒక షార్ప్ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. ఎన్నో సంక్లిష్టమైన విషయాలను ఆయన ఒంటి చేత్తో డీల్ చేశారు.
ఇప్పుడేం ఎన్నికలు లేవు .. అలాంటప్పుడు తోట కాపు కులాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ? ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆయన ఇప్పటి నుంచే కుల బలంతో మరింత బలమైన నేతగా ఎదిగేందుకు సేఫ్ గేమ్ మొదలు పెట్టారా ? అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఇప్పటికిప్పుడు తెలుగుదేశం లేదా జనసేనలోకి వెళ్లే ఆలోచన చేయటం లేదు. కొద్దిరోజులుగా ఇలాగే ఉంటూ రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తూ 2029 ఎన్నికల నాటికి ఖచ్చితంగా పవర్ లోకి వచ్చేలా .. పెద్ద పదవి పొందేలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారని .. అందుకే ఇప్పుడు రాజకీయ బలం కంటే కుల బలాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారన్న చర్చలు తోట త్రిమూర్తులు విషయంలో వినిపిస్తున్నాయి.