మండపేటలో డ్యూటీ ఎక్కిన త్రిమూర్తులు... చంటిబాబు తొందరపడ్డారా?
ఎన్నికల ఏడాదిలోకి ఎంటరైన వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి
By: Tupaki Desk | 2 Jan 2024 9:44 AM GMTఎన్నికల ఏడాదిలోకి ఎంటరైన వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చిన జగన్... మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు, చేర్పుల దిశగా కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. దీంతో... త్వరలో మరికొన్ని సంచలనాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
అవును... అధికార వైసీపీలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీల నియామకాల అంశం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది ఇన్ ఛార్జ్ లను మార్చిన జగన్... వీలైనంత తొందర్లో మరో పెద్ద లిస్ట్ ని బయటపెట్టబోతున్నారని అంటున్నారు. ఈ లెక్కన మొత్తంగా సుమారు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా... ఉమ్మడి ఉభయగోదావరి, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ మార్పులు కాస్త ఎక్కువగా ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే సంక్రాంతి నాటికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో వీలైనంత త్వరగా అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాలు కూడా ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీ కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెబుతుంటారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జోగేశ్వర్ రావు వరుసగా మూడుసార్లు గెలిచారు. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో మండపేటలో ఎలాగైనా జెండా ఎగరెయ్యాలని వైసీపీ కంకణం కట్టుకుందని అంటున్నారు. ఇందులో భాగంగా సరైన అభ్యర్థి కోసం చూస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో తోట త్రిమూర్తులు లైన్ లోకి వచ్చారు.
ఇందులో భాగంగా... వైసీపీ శాసన మండలి సభ్యుడు తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గంలో తన కుమారుడు తోట పృథ్వీరాజ్ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ముఖాముఖిగా కలుసుకున్న తోట... సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు.
మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జీగా తోట త్రిమూర్తులు నియమితులు అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న సమయంలో.. ఆయన ఇదే పట్టణంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క జగ్గంపేట నియోజకవర్గం ఈదఫా తోట త్రిమూర్తులకు కేటాయించబోతున్నారంటూ కథనాలు రావడంతో... సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన పవన్ తో భేటీ అయ్యారని అంటున్నారు.
దీంతో... తోటత్రిమూర్తులకు మండపేట కన్ ఫాం చేసి ఉంటే... జగ్గంపేటలో చంటిబాబు తొందరపడ్డారా అనే చర్చ తెరపైకి రాగా... మండపేట టిక్కెట్ తన కుమారుడికి ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటానంటూ గతంలో వైఎస్ జగన్ ముందు త్రిమూర్తులు ఒక రిక్వస్ట్ పెట్టారంటూ గతాన్ని గుర్తు చేస్తూ కొత్త ఊహగాణాలకు తెరతీస్తున్నారు స్థానికులు!