వైసీపీ కీలక నేతకు ముప్పు! లడ్డూ కేసులో అతడే A1?
A2 నుంచి A5 వరకు తొలుత అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిట్.. A1పై సస్పెన్స్ క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 11 Feb 2025 1:30 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ అడుగులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలతో కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఏపీ పోలీసుల సంయుక్త దర్యాప్తు బృందం ప్రస్తుతానికి నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో పది మంది కూడా ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరి అరెస్టును నేడో రేపో చూపించవచ్చని అంటున్నారు. అయితే నలుగురిని అరెస్టు చేసిన సిట్ పోలీసులు A1 ఎవరో వెల్లడించలేదు. A2 నుంచి A5 వరకు తొలుత అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిట్.. A1పై సస్పెన్స్ క్రియేట్ చేసింది.
బోలె బాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌లను సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఏ ఒక్కరు కూడా A1 లేరు. దీంతో కేసులో A1 ఎవరన్న సస్పెన్స్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని వెల్లడించింది. గత ఐదేళ్లుగా నాణ్యతను పరిశీలించకపోవడంతో కల్తీ నెయ్యిని సప్లై చేశారని ఆరోపణలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. సీబీఐ, ఏపీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ ప్రస్తుతానికి నలుగురు నిందితులను అరెస్టు చేసింది. అయితే A1 అరెస్టుపై క్లారిటీ ఇవ్వకపోవడం ప్రతిపక్షాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేసును ఓ కొలిక్కి తెచ్చామని చెబుతున్న సిట్ A1 ఎవరో వెల్లడించకపోవడం వెనుక వ్యూహం ఏంటన్నది చర్చకు తావిస్తోంది. సిట్ కు ఈ విషయంలో క్లారిటీ ఉన్నా, ఇంకేదో కారణంతో ప్రస్తుతానికి అరెస్టు చూపలేదని అంటున్నారు. దీంతో అనుమానితుల్లో ఆందోళన ఎక్కువవుతోంది.
కూటమి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం A1గా వైసీపీకి చెందిన కీలక నేతను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీటీడీలో కూడా ఇదే విషయమై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సర్కారులో టీటీడీలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని A1గా చూపుతారని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఎవరు A1 అయినా అది వైసీపీకి దెబ్బే అంటున్నారు.
గత ప్రభుత్వంలో టీటీడీకి ఇద్దరు చైర్మన్లుగా వ్యవహరించగా, ఆ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువులే కావడం గమనార్హం. అదేవిధంగా టీటీడీలో కీలక అధికారిగా పనిచేసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని A1గా చూపుతారనేది ఉత్కంఠగా మారింది.