Begin typing your search above and press return to search.

ఆకాశంలో అద్భుతం.. భారీ ప్రాజెక్టుతో చైనా 'సౌర'భం

త్రీగోర్జెస్‌ డ్యామ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్కేంద్రం ఇది. యాంగ్జే నదిపై దీనిని నిర్మించింది చైనా.

By:  Tupaki Desk   |   11 Jan 2025 5:55 AM GMT
ఆకాశంలో అద్భుతం.. భారీ ప్రాజెక్టుతో చైనా సౌరభం
X

త్రీగోర్జెస్‌ డ్యామ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్కేంద్రం ఇది. యాంగ్జే నదిపై దీనిని నిర్మించింది చైనా. ఇక్కడ ఉత్పత్తయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు. ప్రపంచంలోనే అతి పెద్ద మూడు అణు విద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి సమానం అని చెబుతారు. ఇందులో నీటి నిల్వ బరువుకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిందని గతంలో నాసా చెప్పింది.

యార్లంగ్‌ జంగ్బో.. చైనావాడు బ్రహ్మపుత్ర నదిని పిలుచుకునే పేరు. టిబెట్‌లో భారత సరిహద్దుకు సమీపంలో ఈ నదిపై అతిపెద్ద డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే చోట మరో భారీ ప్రాజెక్టు తలపెట్టింది. దీని నిర్మాణ వ్యయం 137 బిలియన్‌ డాలర్లు. దీని ముందు త్రీ గోర్జెస్‌ ప్రాజెక్టు కూడా వెలవెలబోతోంది. బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహాన్ని నియంత్రించడం, భారీ మోతాదులో వరద భారత్ పైకి వదిలి విధ్వంసం రేపగలదట.

ఈ రెండూ భూమ్మీద జరిగిన, జరగబోయే అద్భుతాలు. ఇప్పడు ఇవేకాక.. డ్రాగన్ మరో అద్భుతం దిశగా అడుగులేస్తోందట.. అది కూడా నేల మీద కాదు. ఆకాశంలో.సోలార్ పవర్.. ప్రపంచం ముందుముందు నడిచేది దీనిమీదే.. మరి భవిష్యత్ ను ముందుగానే ఊహించే చైనా ఊరికే ఎందుకు ఉంటుంది..? సౌర శక్తిని ఆసాంతం వాడేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అంటే.. ఆకాశంలో ‘త్రీ గోర్జెస్‌ డ్యామ్‌’ ను కడుతోంది.

ఏమిటీ ప్రాజెక్టు..?

భూమికి 32వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్‌ వెడల్పుతో సోలార్ రేంజ్ (సౌర శ్రేణి) ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా భూ వాతావరణంలో వచ్చే మార్పులు, రాత్రి- పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌర శక్తిని సేకరిస్తారు.కాగా, దీనిని భూస్థిరకక్ష్యలోకి తరలించడం అత్యంత కీలకం. ఆ తర్వాత ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి.. భూమి లోపలి నుంచి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సమానంగా పేర్కొంటున్నారు.