Begin typing your search above and press return to search.

రాజీనామాలు తప్ప వేరే మార్గం లేదా ?!

వీరిలో ప్రధానంగా దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 9:30 AM GMT
రాజీనామాలు తప్ప వేరే మార్గం లేదా ?!
X

తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా ? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ముగ్గురు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లడమా ? లేక స్పీకర్ ద్వారా అనర్హత వేటు ఎదుర్కొనడమా ? హైకోర్డు తీర్పు ద్వారా పదవులు పోగొట్టుకోవడమా ? ఏం జరగబోతుంది ? అన్న ఉత్కంఠ నెలకొన్నది. అయితే వీరి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరారు. వీరిలో ప్రధానంగా దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. మిగిలిన మరో ఏడుగురు ఎమ్మెల్యేల అంశం మరి కొద్దిరోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో మణిపూర్ లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టు వారిని అనర్హులుగా తీర్పునిచ్చింది. మహారాష్ట్రలో ఇదే అంశంలో సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో కోర్టులు, తీర్పులు అంటూ ఆందోళన చెందకుండా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అని పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

అనర్హత వేటుకు సంబంధించి 90 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్లినా తీర్పు జాప్యం కాకుండా ఉంటుందని, ఈ పరిస్థితులలో ఉప ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం అని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో వచ్చిన కోర్టు తీర్పే మిగిలిన వారికి వర్తిస్తుందని, కాబట్టి ఎప్పటికైనా ఎన్నికలకు సిద్దం కావాల్సిందేనని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలతో పాటు, సీపీఐ సభ్యుడి బలం ఉండడంతో శాసనసభలో సంఖ్యాబలం 66 గా ఉంది. ఇక వీరికితోడు ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేల బలం ఉన్న నేపథ్యంలో 73 మంధి ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కోర్టు ద్వారా అనర్హత వేటు ఎదుర్కోవడం కన్నా ఉప ఎన్నికలకు వెళ్లడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.