మూడున్నర కిలోల బంగారం... దారి దోపిడీ ముఠా దొరికింది?
ఈ సమయంలో తాజాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
By: Tupaki Desk | 24 Feb 2024 8:41 AM GMTతూర్పుగోదావరి నల్లజర్ల మండలం పోతవరంలో భారీ దారి దోపిడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భీమవరం చెందిన బంగారు వ్యాపారి జంగారెడ్డిగూడెంలో తమ వ్యాపార లావాదేవీలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ దోపిడీ జరిగింది. ఆ సమయంలో గుర్తుతెలియన వ్యక్తులు కారుతో అడ్డుపడ్డారు. తాము ఇన్ కం ట్యాక్స్ అధికారులమంటూ బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సమయంలో తాజాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
అవును... సంచలన సృష్టించిన దారి దోపిడీకి సంబంధించిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ దోపిడీకి పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారని.. సొత్తు రికవరీపై దృష్టి పెట్టారని అంటున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వీరికోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సీసీ కెమెరా ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిని పట్టుకున్నారని సమాచారం.
వివరాళ్లోకి వెళ్తే... భీమవరానికి చెందిన హోల్ సేల్ నగల వ్యాపారి గార్లే బాలూ నాథూరాం బుధవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో తన వ్యాపారం ముగించుకొని కొయ్యలగూడెం మీదుగా భీమవరం వెళుతున్నారు. ఈ సమయంలో పోతవరం వద్ద ఇన్ కంట్యాక్స్ అధికారులమంటూ వేరే కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు... నాథురాం వద్ద ఉన్న మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు దోపిడీ చేశారు.
దీంతో ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కొవ్వూరు డీఎస్పీ చెంచు రామారావు గురువారం మధ్యాహ్నం రెండు పోలీసు బృందాలను నియమించారు. దీంతో రంగంలోకి దిగిన ఈ రెండు పోలీసు బృందాలు సీసీ పుటేజ్, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా జంగారెడ్డిగూడేనికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. అనంతరం వారిని రాజమండ్రి సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్టు సమాచారం.