Begin typing your search above and press return to search.

కువైట్ మృతుల్లో ముగ్గురు తెలుగువారు !

ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులు కాగా, వీరిలో అత్యధికంగా 24 మంది కేరళవారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 7:39 AM
కువైట్ మృతుల్లో ముగ్గురు తెలుగువారు !
X

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులు కాగా, వీరిలో అత్యధికంగా 24 మంది కేరళవారు ఉన్నారు. ఏడుగురు తమిళనాడుకు చెందిన కార్మికులు, ఒకరు కర్ణాటకకు చెందిన వారు, ముగ్గురు తెలుగువారు, మిగిలిన వారు ఉత్తరాదికి చెందిన వారు ఉన్నారు.

కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీ) వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు వెల్లడించింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

మృతదేహాలను తరలించేందుకు భారత వాయుసేన కువైట్ కు ప్రత్యేక విమానం పంపింది. అక్కడి నుండి మృతదేహాలను కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి విమానాశ్రయానికి వచ్చారు.