అక్కడ ముగ్గురూ అభ్యర్థులూ అసేంబ్లీలో ఫెయిల్ !
ఆ సినిమాలో విద్యార్థులకు పరీక్షల మీద బెంగలాగే ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరుగతున్న ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఉండడం విశేషం.
By: Tupaki Desk | 25 April 2024 8:30 AM GMT‘‘మార్చి నే తలుచుకుంటె మూర్చనే ముంచు కొచ్చె మార్గమే చెప్పు గురువా .. ఎందుకీ హైరానా వెర్రి నాన్నా .. ఉందిగా సెప్టెంబరు, మార్చి పైన’’ అన్న నాగార్జున శివ సినిమాలోని హిట్ సాంగ్ గుర్తుందా. ఆ సినిమాలో విద్యార్థులకు పరీక్షల మీద బెంగలాగే ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరుగతున్న ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఉండడం విశేషం.
ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా సిట్టింగ్ స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో దాదాపు 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కోరుట్ల నుండి శాసనసభకు పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన ఈ ముగ్గురూ వారి, వారి పార్టీల తరపున ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికలలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఈ సారి గెలవాలని పోరాడుతున్నాడు. అయితే గత ఎన్నికలలో పసుపుబోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్, సొంత డబ్బులతో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఈ సారి చిక్కులు తెస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు పసుపుబోర్డుపై ప్రధానమంత్రితో ప్రకటన చేయించినా కూడా ఆ తర్వాత దాని తర్వాతి పరిణామాల గురించి పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి అధికార పార్టీ అన్న కార్డు చూసి ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నాడు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యేలా చూసుకుందామని రేవంత్ చెప్పడం విశేషం. ఇక గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్టీసి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం, సామాజిక నేపథ్యం, బాజిరెడ్డికి పార్లమెంట్ పరిధిలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా బలమైన సామాజిక నేత నేపథ్యం, బాల్కోండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం బాజిరెడ్డికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరి శాసనసభ ఎన్నికలలో ఫెయిల్ అయిన ఈ ముగ్గురు అభ్యర్థులలో లోక్ సభ ఎన్నికలలో ఎవరు పాస్ అవుతారో ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాలి.