విజయవాడ ఎంపీ బరిలో ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు పోటీ!
ఇందులో.. ఒకే కుటుంబం నుంచి పలువురు సభ్యులు నామినేషన్స్ వేయడం ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 25 April 2024 4:14 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలవ్వడంతో పాటు.. నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో... ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. మరోపక్క నామినేషన్లు దాఖలు విషయంలో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో.. ఒకే కుటుంబం నుంచి పలువురు సభ్యులు నామినేషన్స్ వేయడం ఆసక్తిగా మారింది.
అవును... నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నేతలు సమర్పించే అఫిడవిట్ లలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ప్రత్యేక దృష్టి నెలకొంటుందని అంటున్నారు. ఈ సమయంలో విజయవాడ ఎంపీ సీటుకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు నామినేషన్ వేయడం ఆసక్తిగా మారింది.
ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం అన్ని పార్టీలకు అత్యంత కీలకస్థానం అనేది తెలిసిన విషయమే. ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థే గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ భావిస్తుండగా.. ఈసారైనా విజయవాడ లోక్ సభ స్థానంలో తమ జెండా ఎగరేయాలని వైసీపీ బలంగా ఫిక్సయ్యింది. ఈ నేపథ్యంలో... ఇప్పటికే రెండు సార్లు వరుసగా గెలిచిన ఎంపీ కేశినేని నాని.. ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
మరోపక్క గత రెండుసార్లూ గెలిచిన పార్టీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇలా కేశినేని వెంకయ్య కుమారుడు, రామస్వామి కుమారులైన నాని - చిన్ని (సొంత అన్నదమ్ములు) బరిలోకి దిగుతుండగా... తాజాగా నెక్స్ట్ జనరేషన్ కుర్రాడు తెరపైకి వచ్చాడు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ నుంచి వల్లూరి భార్గవ్ తాజాగా విజయవాడ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.
కారణం ఏమిటంటే... నానీ - చిన్నీలు.. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి కుమారులైతే... వెంకయ్య కుమార్తె కస్తూరి మనవడు భార్గవ్ కావడం గమనార్హం. అంటే... కేశినేని వెంకయ్య మనవళ్లు నానీ - చిన్ని అయితే... భార్గవ్ మునిమనవడు అన్నమాట! ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు మూడు పార్టీల నుంచి ఒకే స్థానానికి బరిలోకి దిగడం ఆసక్తిగా మారింది.