మైనంపల్లి ఔట్.. మరి మల్కాజిగిరి సీటు ఎవరికి?
మరోవైపు మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ తరఫున మైనంపల్లి తప్పుకోవడంతో ఈ సీటును కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 23 Sep 2023 5:17 AM GMTఅసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా ప్రకటించడంతో కేసీఆర్ కు షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రస్తుతం మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుకు సీటు లభించింది. అయితే ఆయన తన కుమారుడు రోహిత్ కు మెదక్ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అయితే మైనంపల్లి కోరికను కేసీఆర్ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో మైనంపల్లి బీఆర్‌ఎస్ కు రాజీనామా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ తరఫున మైనంపల్లి తప్పుకోవడంతో ఈ సీటును కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మైనంపల్లికి కేటాయించిన స్థానంలో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతంగా ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్ రాజు పోటీ చేస్తారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడైన శంభీపూర్ రాజును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మల్కాజిగిరికి మీ పేరును ఫైనల్ చేసినట్టు హరీశ్.. ఆయనకు అప్పుడే చెప్పినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మొదట విడత జాబితాలోనే శంభీపూర్ రాజు టికెట్ ఆశించారు. అయితే ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు అనుకోకుండా మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేయడంతో శంభీపూర్ రాజుకు అనుకోని అదృష్టం కలిసివచ్చిందని చర్చ జరుగుతోంది.
అలాగే ఆల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి పేరు కూడా మల్కాజిగిరి స్థానానికి వినిపిస్తోంది. ఈమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్వాల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మేయర్ పదవి కోసం గట్టిగా పోటీపడ్డప్పటికీ ఈ పదవిని బీఆర్‌ఎస్ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి కట్టబెట్టారు.
ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు తప్పుకోవడంతో మల్కాజిగిరిలో విజయశాంతి రెడ్డిని పోటీ చేయించొచ్చని చెబుతున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడం, బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం, అందులోనూ మహిళ కావడం విజయశాంతికి కలిసి వస్తాయని అంటున్నారు.
మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా మల్కాజిగిరి సీటు కోసం పోటీపడుతున్నారు. ఈ విషయంలో మల్లారెడ్డి.. కేసీఆర్ ను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరిలో విజయం సాధించాలంటే అది తన అల్లుడు వల్లే అవుతుందని మల్లారెడ్డి చెబుతున్నట్టు సమాచారం.
అయితే కేసీఆర్ ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. విజయశాంతికి మల్కాజిగిరి సీటు ఇచ్చి మల్లారెడ్డి అల్లుడిని మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారని టాక్.
వాస్తవానికి మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ కు రాజీనామా ప్రకటించగానే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి సీటు కేటాయించారని ప్రధాన టీవీ చానెళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు కూడా వచ్చాయి. అయితే అధికారికంగా ఇంకా బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లోనే మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు.