రాజకీయాల్లో శాశ్విత శత్రువులు ఉండరంతే.. సాక్ష్యం ఈ ఫోటోనే!
రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసే వారందరికి చెప్పే మొదటి మాట.. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు కానీ శాశ్విత మిత్రులు కానీ ఉండరని.
By: Tupaki Desk | 26 April 2024 5:11 AM GMTరాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసే వారందరికి చెప్పే మొదటి మాట.. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు కానీ శాశ్విత మిత్రులు కానీ ఉండరని. ఆ మాటకున్న శక్తి ఎంతన్న విషయాన్ని గతాన్ని చూసినా.. వర్తమానాన్ని చూసినా నిజమే కదా? అన్న భావన కలగటం ఖాయం. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు ఎప్పటికి ఉండరన్న దానికి తగ్గట్లే.. పలు కాంబినేషన్లను చూస్తుంటాం. తాజాగా అలాంటిదే ఒకటి ఏపీలో ఆవిష్క్రతమైంది.
పదేళ్ల క్రితం వరకు కూడా మూడు ధ్రువాలుగా ఉన్న ముగ్గురు ఏకం అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ.. రాజకీయం పుణ్యమా అని ఆ ముగ్గురు ఏకతాటి మీదకు రావటమే కాదు.. ఎన్నికల బరిలోకి సింగిల్ గా దిగిన వైఎస్ జగన్ ను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజా రేర్ పిక్ కు కారణమైన ఈ ముగ్గురు గురించి ప్రస్తావించాలి. వారిలో ఒకరు దాదాపు పదిహేనేళ్లు (కాస్త తక్కువగా) ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒకరైతే.. దగ్గర దగ్గర మూడేళ్లకు పైనే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఆఖరి ముఖ్యమంత్రి అన్న పేరును సొంతం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి. ఇక.. చట్టసభలకు పోటీ చేసినా గెలుపొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడని సందర్భాలు ఉన్నాయి. కాల ప్రవాహనంలో కాస్త వెనక్కి వెళితే.. ఈ ముగ్గురు ముగ్గురిని నానా మాటలు అనుకున్న సందర్భాలెన్నో. అలాంటి ముగ్గురు.. తాజాగా కూటమిగా మారి కలిసి పని చేస్తున్న వైనం చూసినప్పుడు.. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడు అనిపించేది ఒక్కటే రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఉండరన్న విషయం మరోసారి ఫ్రూవ్ అవుతుంది.
రాజకీయాల్లో అప్పుడప్పుడు అపూర్వ కలయికలు జరుగుతుంటాయి. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని ఏపీలో అలాంటి సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. రాజంపేటలో జరిగిన సభలో చంద్రబాబు.. కిరణ్ కుమార్ రెడ్డి.. పవన్ కల్యాణ్ ముగ్గురు ఒక వేదిక మీద నిలిచి.. తమ ఉమ్మడి శత్రువును చీల్చి చెండాటమే కాదు.. తమ వారికి ఓట్లు వేయాలని కోరారు.
కాస్తంత వెనక్కి వెళితే.. వైఎస్ హయాంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. వాడి వేడి వ్యాఖ్యలతో చంద్రబాబు తప్పుల్ని ఉతికి ఆరేసే నేతగా తెలుగు ప్రజలకు ఆయన గుర్తుండిపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి మూలాలు చిత్తూరు జిల్లానే కావటంతో.. చంద్రబాబును టార్గెట్ చేయటం మరింత సులువుగా ఉండేది. ఇందుకోసం ఆయన్ను ప్రత్యేకంగా చంద్రబాబు మీద ప్రయోగించే వారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
చంద్రబాబును టార్గెట్ చేయటం కోసం ప్రత్యేకంగా కొందరు నేతల్ని వైఎస్ ప్రయోగించేవారు. వారిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రముఖుడిగా చెప్పాలి. అలాంటి ఆయన.. ఈ రోజున చంద్రబాబుతో భుజాలు రాసుకుపూసుకోవటమే అసలుసిసలు రాజకీయంగా చెప్పక తప్పదు. ఇక.. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే 2014లో మిత్రుడిగా వ్యవహరించటం.. 2019 వచ్చేసరికి ప్రత్యర్థిగా మారటం.. ఆ సందర్భంలో చంద్రబాబుపై ఎంతలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
ఇక.. ఈ ఇద్దరి నేతలపై మాటల తూటాలతో ఫైర్ అయిన ఘన చరిత్ర చంద్రబాబుది. అలాంటి ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకు రావటం.. కలిసి మాట్లాడటం.. ఉమ్మడి ఎజెండాను ప్రజలకు వివరించటం.. తమ ప్రచారం ముగిసిన తర్వాత ఒకే హెలికాఫ్టర్ లో ఈ ముగ్గురు అధినేతలు ప్రయాణించటం.. ఆ సందర్భంగా జనసేనాని పవన్ ఫోటో తీయటం.. అది కాస్తా బయటకు రావటంతో.. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఉండరన్నది మరోసారి రుజువైందని చెప్పాలి.