ఏపీలో మూడు పార్టీలు...మూడు కులాలు...!
నిజానికి ఏపీ అంటేనే కులాల కుంపటిగా చేబుతారు. ఎన్నికలు వస్తే చాలు సంకుల సమరం సాగుతుంది.
By: Tupaki Desk | 12 Feb 2024 1:41 PM GMTఏపీలో మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల గురించి వాటి కుల గోత్రాల గురించి అయిదు కోట్ల మంది జనాలు ఎలాంటి రాజకీయ అవగహాన లేకపోయినా ఇట్టే చెప్పేస్తారు. జగన్ వైసీపీకి రెడ్ల పార్టీగా, చంద్రబాబు టీడీపీని కమ్మల పార్టీగా, పవన్ జనసేనను కాపుల పార్టీగా ఏపీ జనాలు అయితే చెప్పుకుంటారు. అలా ప్రచారంలో కూడా ఉంది.
నిజానికి ఏపీ అంటేనే కులాల కుంపటిగా చేబుతారు. ఎన్నికలు వస్తే చాలు సంకుల సమరం సాగుతుంది. ఫలానా కులం అని అన్ని ఓట్లు ఉన్నాయని చూసి మరీ టికెట్లు ఇస్తారు. కులాల గురించి ఏ మాత్రం బిడియం సంకోచం లేకుండా మాట్లాడుకునే రాజకీయం ఒక్క ఏపీలోనే సాగుతుంది. అలాగని దేశంలో కులాలు లేవా వాటిని రాజకీయాల్లో వాడుకోవడం లేదా అంటే అన్ని చోట్లా ఉంది.
అనేక రాష్ట్రాలలో కులాల సమీకరణలను కూడా వ్యూహాలుగా వాడుతారు. వాటిని కూడా ఎత్తులుగానే చూస్తారు. కానీ మాంసం తిన్నామని ఎముకలు ఒంట్లో వేలాడేసుకునే హిస్టరీ మాత్రం ఏపీలోనే ఉంది అని అంటున్నారు. కులాలు ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఓపెన్ గా మాట్లాడేసుకుంటారు. అంటే ముసుగు అన్నది ఎక్కడా లేదు అన్న మాట.
ఇదిలా ఉంటే కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఏపీలో అడుగడుగునా కనిపిస్తుంది. కులం చూపించి హవా చలాయించడం కూడా ఇక్కడే ఎక్కువగా చూస్తారు. ఇంతలా కులం పేరు చెప్పుకుంటూ కులం జపం చేస్తూ చేస్తే రాజకీయాల్లో నిజంగా ఆయా కులాలకు న్యాయం జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కులం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. కులాన్ని అడ్డంగా వాడేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది అని అంటున్నారు.
నిజంగా ఫలానా కులం పార్టీ అధికారంలోకి వస్తే ఆ కులానికి చెందిన వారు అంతా బాగుపడాలి కదా. మిగిలిన కులాల వారి కంటే వారు బాగా ఉండాలి కదా. ఇది సింపుల్ గా ఆలోచిస్తే అందరూ అనుకుంటారు. కానీ అలా ఏమీ జరగడంలేదు. అందరి పేదల మాదిరిగానే ఆయా కులాలలో పేదలు నిండుగా మెండుగా ఉన్నారు. వారు తమ జీవితాలు ఇంతే అనుకుంటూ గడిపేస్తూ ఉంటారు.
బతుకు పోరాటం వారికి ఎపుడూ తప్పదు. మా వాడు అధికారంలో ఉన్నారు అని చెప్పుకోవడమే వారికి మిగులుతోంది. కులాన్ని చూసి గర్వించాలో తమ పేదరికం తలచుకుని బాధపడాలో అర్ధం కాని పరిస్థితి. మీకేంటి అని మిగిలిన కులాలు అంటూంటే అమాయకంగా నవ్వడమే తప్ప వారు చేసేది ఏమీ ఉండడదని అంటున్నారు
ఏపీలో కులాలను ఎలా తీసుకుని వెళ్లారు అంటే పిచ్చి పీక్స్ దాకా పాకుతోంది. ఆరు నూరు అయినా మా వాడు సీఎం కావాల్సిందే అన్న పట్టుదల పెరిగిపోతోంది.ఎవరో పదవిలో కూర్చుంటే మనకేంటి వస్తుంది అన్న కనీస ఆలోచన అయితే యువతలో కూడా లేకపోవడం విడ్డూరంగానే ఉంది. కులం ఒక మత్తు అని మేధావులు అన్న మాటలు ఏపీ రాజకీయాన్ని చూస్తే అక్షర సత్యాలు అని అనిపిస్తాయి.
కులం కూడు పెట్టదు అని ఎందరు పెద్దలు చెప్పినా కూడా ఆధునిక యుగంలో కూడా కులపోడి జెండా పట్టుకుని జేబుకు చిల్లు పెట్టుకుని సొంత డబ్బు తగలెట్టుకుని ఫకీర్లుగా మారిన వారి దీన గాధలు గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఏపీలో ఎన్నో కనిపిస్తాయి.
కులానికి చెందిన వారు పార్టీ పెట్టారని గతంలో ఉన్న భూముని ఉంచుకున్న ఆసరాని కూడా తాకట్టు పెట్టుకుని మరీ రాజకీయ జూదమాడి చివరికి ఈ రోజున ఏమీ కాకుండా పోయిన వారు కళ్ల ముందే ఉన్నారు. వారు అలా ఉండగానే మరో తరం బయలుదేరి అదే పని చేస్తోంది. కులం కాదు గుణం ముఖ్యం, బాగా పాలించే వారు రావాలి అని ఎవరూ అనడం లేదు.
కాటికి కాళ్ళు చాపుకున్న పెద్దలు సైతం మా కులపోడుకి పదవి దక్కాల్సిందే అని నినదిస్తున్నారు అంటేనే కులం కంపు ఎంతగా ఏపీ రాజకీయాన్ని గబ్బు పట్టించిందో అర్ధం అవుతుంది. కులం అయితే చాలు అసమర్ధుడు అయినా అందలం ఎక్కాల్సిందే అని ఒక రాజకీయ పార్టీ పట్టుదల. మా కులం వారు అయితే చాలు అవినీతి చేసినా ఓకే అనే వారు మరో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.
వీరి మానసిక వైఖరి ఎలా ఉందో తెలియదు కానీ ఇలాంటి వారే పెట్టుబడిగా చేసుకుని ఏపీలో జయహో కులమా అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు పండుగ చేసుకుంటున్నాయి. ఏ మూల ఉన్న వారినైనా కులం కలుపుతోంది. ఇది కాదు ప్రజాస్వామ్యానికి అర్ధం పరమార్ధం అని మేధావులు ఎంత మొత్తుకుంటున్నా కులం సంకెళ్ళను ఛేదించి ముందుకు రాలేని రాజకీయాల్లో జనం తీర్పు ని ప్రతీ ఎన్నికలలోనూ ఓర్పుగా చూడడం ఆ మీదట వేడి నిట్టూర్పు విడవడమే వివేకవంతుల వంతు అవుతోంది.