మచిలీపట్నంలోనూ త్రిముఖ పోరా... ఏం జరుగుతోంది...!
మరోవైపు.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు.
By: Tupaki Desk | 23 Jan 2024 12:30 PM GMTఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలోనూ ఈ దఫా త్రిముఖ పోరు సాగనుందా? ఇక్కడ మూడు పార్టీలకు చెందిన కీలక నాయకులు పోటీ పడనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు రంగంలో ఉన్నారు. ఈయన పోటీతో యువత అంతా తమవైపే ఉందని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక, పేర్ని కుటుంబ అభిమానులు , క్రీడాభిమానులు కూడా.. కిట్టుకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. ఈయన పేరును ఇప్పటికే చంద్రబాబు గుడివాడ సభలో ప్రకటించేశారు. ఆయనను గెలిపించాలని కూడా.. చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరగనుందని అందరూ అనుకుంటుండగా.. అనూహ్యంగా మచిలీపట్నంలో కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ, సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన కోన ఫౌండేషన్ చైర్మన్ కోన నాగార్జునను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భర్త, బ్రదర్ అనిల్ కుమార్‌కు కోనకు మధ్య స్నేహం ఉంది. ఆయన కార్యక్రమా ల్లో ఈయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ సూచనల మేరకు.. కోన నాగార్జున తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అంతేకాదు.. ఆయనను మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని.. ఆఫ్ దిరికార్డుగా షర్మిల వాగ్దానం చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న వ్యక్తిగా కోనకు పేరుంది.
దీంతో కోన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఇదే జరిగితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేర్ని కృష్ణమూర్తి, టిడిపి జనసేన పార్టీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ నుండి కోన నాగార్జున ఎన్నికల్లో తలపడబోతున్నట్టు అవుతుంది. మరీ ముఖ్యంగా మచిలీపట్నంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపథ్యానికి తోడు బ్రదర్ అనిల్ సువార్త సభలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కోనకు చాన్స్ ఇవ్వడంతో మచిలీపట్నంలోనూ త్రిముఖ పోరు తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు.