టీడీపీలో మూడు ముక్కలాట.. ఆ నియోజకవర్గం హాట్ టాపిక్...
కావలికి సంబంధించి.. పెద్దగా పోటీ లేకపోవడం తో ఇక్కడ నుంచి కావ్య కృష్ణారెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2023 2:45 AM GMTవచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఎన్నికలకు కనీసం నాలుగు మాసాల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం వల్ల.. పార్టీకి చివరి నిముషంలో ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనేది అధినేత అభీష్టంగా ఉంది. ఈ క్రమంలోనే కీలకమైన నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో.. నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు చర్చించారు.
వీటిలో కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. కావలికి సంబంధించి.. పెద్దగా పోటీ లేకపోవడం తో ఇక్కడ నుంచి కావ్య కృష్ణారెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈయనను నెలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తారని.. అందరూ అనుకున్నారు. కానీ, నెల్లూరులో వైసీపీ బలమైన నాయకుడిని నిలబెడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ వ్యూహం మార్చుకుంది. ఈ క్రమంలోనే కావ్యను కావలి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు.
ఇక, మరో నియోజకవర్గం ఉదయగిరి విషయానికి వస్తే.. ఇక్కడే పార్టీ చిక్కుముడులు ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇద్దరు పోటాపోటీగా ఉండగా.. మరో నాయకుడు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖ రరెడ్డి ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది ప్రారంభం వరకు ఇక్కడ బొల్లినేని రామారావు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని.. బొల్లినేని కొన్నాళ్ల కిందటి వరకు చెప్పారు.
దీంతో సురేష్ అనే నాయకుడిని పార్టీ తీసుకువచ్చింది. ఈయన యాక్టివ్‌గానే ఉన్నారు. మొదట్లో బొల్లినే ని, సురేష్‌లు కలిసి కూడా పనిచేశారు.కానీ, ఎక్కడో తేడా కొట్టి.. ఈ ఇద్దరి మధ్య స్నేహం పొసగడం తగ్గిం ది. ఇది.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై ప్రభావం చూపింది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని బొల్లినేని పట్టుబట్టారు. మరోవైపు.. సురేష్ కూడా అంతే రేంజ్‌లో వత్తిడి తెస్తున్నారు.
ఇక, ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గీత దాటారంటూ.. వేటు పడ్డ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి కూడా. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి రెడీ అయ్యారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో ఈ నియోజకవర్గం సమీక్ష, టికెట్ తేల్చే వ్యవహారాలను పెండిగ్‌లో పెట్టింది.