Begin typing your search above and press return to search.

తుమ్మలా..? కాస్త శాంతించండి.. బీఆర్ఎస్ బుజ్జగింపులు

తుమ్మలకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో రాజకీయంగా విభేదాలున్నాయి

By:  Tupaki Desk   |   23 Aug 2023 9:29 AM GMT
తుమ్మలా..? కాస్త శాంతించండి.. బీఆర్ఎస్ బుజ్జగింపులు
X

''ఏది ఏమైనా సరే.. ఈసారి పాలేరులో పోటీ చేస్తా''.. ఇదీ 15 రోజుల కిందట ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్య. అప్పటికి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని కాస్త నమ్మకం ఉంది. కానీ, అది జరగని పని అని అభ్యర్థుల జాబితా వెల్లడితో స్పష్టమైంది. మరి పుట్టి పెరిగిన టీడీపీతో మూడున్నర దశాబ్దాల బంధాన్ని వదులుకుని.. స్నేహితుడైన కేసీఆర్ ను నమ్మి వచ్చినందుకు ఆయనేం చేయాలి..? సత్తా చూపగల శక్తి ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరం కావాల్సిందేనా..? మరోవైపు కచ్చితంగా పోటీ చేయాల్సిందే అంటున్న అనుచరులను బుజ్జగించడం ఎలా..? అందుకనే తుమ్మల కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అది పార్టీ మారడమా..? లేక రాజకీయాలకే గుడ్ బై చెప్పడమా? ఏది అయి ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే, పార్టీ మారతారనే అభిప్రాయాలు, కథనాలు, ఊహాగానాలు బలంగా వ్యాపిస్తుండడంతో బీఆర్ఎస్ బుజ్జగింపులకు దిగింది.

తుమ్మల వెళ్లిపోతే బీఆర్ఎస్ కు దెబ్బే?

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. మంత్రిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఓడినా.. ఆయనపై చెక్కుచెదరని అభిమానం ఉంది. అయితే, ఇప్పటికే ఐదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన ఇంకెంత కాలం ఈ అభిమానాన్ని కాపాడుకోగలరు? రాజకీయాల్లో ఎవరైనా కొంత కాలం లాయల్ గా ఉండగలరు తప్ప ఎల్లవేళలా కాదుజ ఈ నేపథ్యంలోనే పాలేరు టికెట్ రాకపోవడం పట్ల ఆయన తీవ్ర అసౌకర్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు దూరమైనందున తుమ్మల కూడా బీఆర్ఎస్ ను వీడితే ఉమ్మడి ఖమ్మంలో పార్టీకి పెద్ద దెబ్బ. అందుకనే బీఆర్ఎస్ ఆయనను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తోంది.

రాజకీయ ప్రత్యర్థినే రాయబారానికి పంపి

తుమ్మలకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో రాజకీయంగా విభేదాలున్నాయి. అయితే, తుమ్మల ముందుగా బీఆర్ఎస్ లోకి రాగా.. నామా 2019 ఎంపీ ఎన్నికల ముందు చేరారు. పొంగులేటిని పక్కనపెట్టే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నామాను తీసుకొచ్చింది. అలా ఒకప్పుడు ముగ్గురు కీలక నాయకులు ఒకే పార్టీలో ఉన్నట్లైంది. అయితే, నామా రాకకు కొద్దిగా ముందే తుమ్మల పాలేరులో (2018) ఓడిపోయారు. నామా మాత్రం 2019లో ఎంపీగా గెలిచారు.

ఇది కూడా తుమ్మలకు కొంత ఇబ్బందికర పరిస్థితే. కాగా, ఇప్పుడు అదే నామాను తుమ్మల వద్దకు బీఆర్ఎస్ రాయబారానికి పంపింది. తుమ్మల ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం.. నామాతో పాటు కమ్మ సామాజిక వర్గానికే చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావును ఆయన ఇంటికి పంపింది. వీరిద్దరూ తుమ్మలతో చర్చలు సాగిస్తున్నారు. పార్టీని వీడొద్దంటూ బుజ్జగిస్తున్నారు. మరి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.