ఇక అన్ని థియేటర్లలో టికెట్ ధర రూ.200
సినిమా రంగానికి మరింత బలాన్నిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 7 March 2025 3:08 PM ISTకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.4,08,647 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఆయన, మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా పరిశ్రమ అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
సినిమా రంగానికి మరింత బలాన్నిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమా టికెట్ ధరను రూ.200గా నిర్ణయించాలని సిద్ధరామయ్య ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే ధర అమలులో ఉంటుందని తెలిపారు. సామాన్య ప్రజలు కూడా సినిమాలను అందుబాటులోకి తేవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో మైసూర్‌లో ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని కేటాయిస్తూ, ఇందుకోసం రూ.500 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్ణాటక సీఎం నిర్ణయాన్ని కన్నడ సినీ పరిశ్రమ స్వాగతిస్తుండగా.. ప్రేక్షకులు మాత్రం మా నెత్తిన భారం వేశారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.