Begin typing your search above and press return to search.

వైసీపీ ఇంచార్జులకు టికెట్లు కంఫర్మ్ కాదా.. జగన్ ఇస్తున్న సందేశమిదే...?

వైసీపీలో ఎమ్మెల్యేలు కాకుండా టీడీపీ గెలిచిన ఇరవై మూడు సీట్లలో ఇంచార్జులు ఉన్నారు. వారికి టికెట్లు కంఫర్మ్ అని అంతా అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 12:45 PM GMT
వైసీపీ ఇంచార్జులకు టికెట్లు   కంఫర్మ్  కాదా.. జగన్ ఇస్తున్న సందేశమిదే...?
X

వైసీపీలో ఎమ్మెల్యేలు కాకుండా టీడీపీ గెలిచిన ఇరవై మూడు సీట్లలో ఇంచార్జులు ఉన్నారు. వారికి టికెట్లు కంఫర్మ్ అని అంతా అనుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పనితీరు బాగాలేని వారికి టికెట్లు దక్కవని అనుకుంటున్నదే. ఇపుడు వారితో పాటు ఇంచార్జిలలో పనితీరు మెరుగు పడన్ వారి ప్లేస్ లో కొత్త వారిని నియమించడం ఖాయమని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట.

నాలుగేళ్లుగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న వీమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలను తప్పించి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించారు. అలాగే విశాఖ పశ్చిమ విషయం తీసుకుంటే గతంలో ఉన్న ఇంచార్జిని తప్పించి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కి బాధ్యతలు అప్పగించారు.

ఉత్తరానికి ఇంచార్జిగా కేకే రాజు ఉన్నారు. ఇక సౌత్ నుంచి ఏకంగా సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆయనే ఇంచార్జిగా ఉన్నారు. ఇదే తీరున టెక్కలిలో ఇంచార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సతీమణి వాణి ఉన్నారు. పేడాడ తిలక్ ని తప్పించి దువ్వాడ శ్రీనుకు అక్కడ ఇంచార్జి ఇచ్చారు. ఆయన్ని తప్పించి వాణికి ఇచ్చారు.

ఇచ్చాపురం విషయంలో అలాగే ఉంది. ఇంచార్జిగా పిరియా సాయిరాజ్ ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆయన సతీమణి జెడ్పీ చైర్మన్ పిరియా విజయకే అని ప్రచారంలో ఉంది. అయినా సరే ఏదీ కన్ ఫర్మ్ కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీని మీద ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇంచార్జిని అని ఒకరిని పెట్టామంటే మార్చమని కాదని, అవసరం బట్టి పనితీరు ని బట్టి మార్చుకుంటూ పోతామని బాంబు లాంటి సమాచారమే అందించారు. వైసీపీ బలమైన పార్టీ, గెలిచే పార్టీ అని ఆయన అంటూ తమకు కావాల్సింది గెలుపు గుర్రాలు అని స్పష్టం చేశారు. అవకాశాలు ఇస్తామని అదే సమయంలో మారుస్తామని ఆయన అంటున్నారు.

దీంతో ఇంచార్జిలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ల విషయంలో హామీ అయితే లేదు అని చెప్పినట్లు అయింది. గెలుపు గుర్రాలు మాకు కావాలి అని వైవీ సుబ్బారెడ్డి అన్న మాట జగన్ ఇస్తున్న సందేశమే అని అంటున్నారు జనంలో పట్టు ఉండి ఎవరికి గెలిచే చాన్స్ ఉంటే వారికే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. అదే సమయంలో ఇంచార్జి అంటే ఇక టికెట్ ఖాయమని ఎవరైనా అనుకుంటే తప్పు అని తాజాగా విశాఖ తూర్పు లో చేసిన మార్పుతో స్పష్టం చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీలో టికెట్ల విషయంలో ఎవరికీ ఏ హామీ లేదని, చివరి వరకూ వడపోత సాగుతూనే ఉంటుందని అంటున్నారు.

ఆ విధంగా ప్రజలలో ఉంటూ తమ గ్రాఫ్ ని ఎప్పటికపుడు పెంచుకుంటూ పోతేనే టికెట్ దక్కుతుంది అన్న సంకేతాలను వైసీపీ అధినాయకత్వం ఇస్తోంది అని అంటున్నారు. మరి వైసీపీలో చాలా మందికి ఇది మింగుడుపడని పరిణామమే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను అని ఇప్పటికే చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఇపుడు వారి సంగతేంటి అన్న చర్చ అయితే వేడిగా వాడిగా వైసీపీలో సాగుతోంది.