Begin typing your search above and press return to search.

తొలి జాబితాలో హైలైట్.. తొలినుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్

అయితే, జాబితాను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ నలుగురి ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   9 March 2024 10:02 AM GMT
తొలి జాబితాలో హైలైట్.. తొలినుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకంగా 195 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తెలంగాణలో మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించేసింది. ప్ర్యత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ.. పదేళ్ల తర్వాత గానీ అధికారం దక్కని కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో కాస్త వెనుకబడింది. అయితే, ఈ లోటును తీరుస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా తెలంగాణలో నలుగురు అభ్యర్థులున్నారు. అయితే, జాబితాను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ నలుగురి ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది.

నమ్ముకున్నవారికే ముందు

శుక్రవారంసాయంత్రం కాంగ్రెస్ తొలిజాబితాలోని తెలంగాణ నాయకుల పేర్లు ఇవీ అంటూ సునీతా మహేందర్ రెడ్డి (చేవెళ్ల), బలరాం నాయక్ (మహబూబాబాద్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్లగొండ), సురేశ్ శెట్కార్ (జహీరాబాద్) పేర్లు వినిపించాయి. వీరిలో చివరకు సునీతా మహేందర్ రెడ్డి పేరు లేకుండానే జాబితా విడుదలైంది. మొదట ప్రచారం జరిగిన జాబితా ఫేక్ అని తేలింది. కాగా, సునీతా పేరు స్థానంలో మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ నాయకుడు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. సునీతా రెడ్డి ఇటీవల భర్త మహేందర్ రెడ్డి వెంట రాగా కాంగ్రెస్ లో చేరారు. మొన్నటివరకు వీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. మరోవైపు చివరకు ప్రకటించిన నలుగురు అభ్యర్థులూ దశాబ్దాలుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న వారు కావడం గమనార్హం.

విద్యార్థి నాయకుడు వంశీ

కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ యూఐకి ఉమ్మడి ఏపీలోనే అధ్యక్షుడిగా పనిచేశారు వంశీచందర్ రెడ్డి. ఎంబీబీఎస్ చదివిన ఆయన ప్రజా సేవ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలూ నిర్వర్తించారు. కల్వకుర్తి నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడారు. ఇటీవల పోటీకి దూరంగా ఉన్నారు. ఇక సురేశ్ శెట్కార్ కుటుంబానిది పూర్తిగా కాంగ్రెస్ కే అంకితమైన చరిత్ర. వీరి తండ్రి శివరావు శెట్కార్ మూడుసార్లు, పెద్దనాన్న అప్పారావుశెట్కార్ రెండుసార్లు నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సురేశ్ శెట్కార్ సైతం 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి పెద్ద కుమారుడు. ఇక బలరాం నాయక్ 2009-14 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. వీరంతా గత పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకే తొలిజాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు. తద్వారా.. పార్టీకి విధేయులు ఎవరో కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించినట్లు అయింది.