కొమురం భీం జిల్లాలో పెద్దపులి హల్‌చల్
కొమురం భీం జిల్లా ప్రజలను పెద్దపులి నిద్రపోనీయడం లేదు. ఇప్పటివరకు పలు పశువుల మీద దాడులకు పాల్పడిన పులి ఇప్పుడు మనుషులను సైతం వదలడం లేదు.
By: Tupaki Desk | 30 Nov 2024 9:31 AM GMTకొమురం భీం జిల్లా ప్రజలను పెద్దపులి నిద్రపోనీయడం లేదు. ఇప్పటివరకు పలు పశువుల మీద దాడులకు పాల్పడిన పులి ఇప్పుడు మనుషులను సైతం వదలడం లేదు. గత రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఓ యువతిపై దాడిచేసి ప్రాణాలు తీయగా.. ఈ రోజు మరో వ్యక్తిపై దాడికి పాల్పడింది.
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్‌లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఓ వివాహితపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి కూలీలు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ఆ వెంటనే తోటి కూలీలు అంతా ఆమెను దవాఖానకు తరలించారు. కానీ.. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని గన్నారం వాసి మోర్లె లక్ష్మిగా (21) గుర్తించారు. మృతదేహంతో కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఈ ఘటన మరువక ముందే ఈ రోజు మరోవ్యక్తిపై పెద్దపులి దాడికి పాల్పడింది. పొలంలో పనిచేస్తున్న రైతుపై పులి దాడికి దిగింది. స్థానికులు కేకలు పెట్టడంతో పారిపోయింది. ఈ ఘటనలో రైతు సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. పెద్దపులి వరుస దాడులతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
కాగా.. ఇదే జిల్లాలో కొన్ని రోజులుగా పెద్దపులి కలకలం సృష్టిస్తూనే ఉంది. ఇటీవల వాంకిడి మండలంలోని సోనాపూర్ అటవీ ప్రాంతంలో పశువుల మందపై దాడికి పాల్పడింది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఆదివారం కూడా దాబా, బండకాస గ్రామంలో కోర్ డోబ్రాలొద్ది ప్రాంతంలో ఆవుల మందపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక ఆవు మృతిచెందగా.. మరో రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. అలాగే.. బండకాస గ్రామానికి చెందిన పశువుల కాపరి సోయం బాబురావు పశువులను మేతకు తీసుకెళ్లగా మధ్యాహ్నం పశువుల మందపై దాడిచేసింది. ఆ పశువుల కాపరి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. నిత్యం పులి సంచారం పెరగడం.. దాడులు సైతం చేస్తుండడంతో గిరిజన రైతులు పశువుల మేతకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.