అమెరికాలో టిక్ టాక్ బంద్... తెరపైకి సంస్థ కొత్త ఆశాభావం!
అయితే.. అలాంటిది ఏమీ లేకుండా అర్ధరాత్రి నుంచి అమెరికాలో టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి.
By: Tupaki Desk | 19 Jan 2025 6:45 AM GMTఈ నెల 19నుంచి అమెరికాలో టిక్ టాక్ యాప్ సేవలు నిలిచిపోనున్నాయనే కథనాలు గత కొన్ని రోజులుగా విపరీతంగా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికాలో టిక్ టాక్ బాధ్యతలు ఎలాన్ మస్క్ కు ఇవ్వబోతున్నారనే చర్చా జరిగింది. అయితే.. అలాంటిది ఏమీ లేకుండా అర్ధరాత్రి నుంచి అమెరికాలో టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి.
అవును... ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ అగ్రరాజ్యంలో తన సేవలను నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే యూఎస్ లోని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లలో ఈ యాప్ కనుమరుగైందది. ఈ మేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు మెసేజ్ లు పంపిస్తోందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో.. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నాం అని టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ నుంచి యూజర్లకు మేసేజ్ లు అందుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది శాస్వతమా, తాత్కాలికమా అనే సస్పెన్స్ కొనసాగుతుంది!
వాస్తవానికి ఈ టిక్ టాక్ ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. ఇదే సమయంలో అమెరికాలోని ప్రతినిధుల సహ ఇటీవల ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా.. చైనా యాజమాన్యాన్ని వదిలుకోకపోతే టిక్ టాక్ నిషేధం ఎదుర్కోవాల్సిందే అనే సారాంశంతో బిల్లు తయారైందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు అమెరికా సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. ఈ సమయంలో ఈ నెల 19లోపు టిక్ టాక్ ను అమ్ముతారా.. లేక, నిషేధాన్ని ఎదుర్కొంటారా అనేది నిర్ణయించుకోవాలని తెలిపింది. దీంతో... విక్రయంపై ఆసక్తి లేదో ఏమో కానీ సేవలు ఆపేయాలనే సంస్థ నిర్ణయించుకుంది.. ఈ మేరకు యూజర్లకు సమాచారం ఇచ్చింది.
దీంతో.. నేటి నుంచి 170 మిలియన్ల మంది యూజర్స్ ని కలిగి ఉన్న అమెరికాలో టిక్ టాక్ అదృశ్యమవుతోంది. అయితే... ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం టిక్ టాక్ పునరుద్ధరణకు చర్చలు జరుపుతామని.. టిక్ టాక్ ఈ సందర్భంగా చెబుతూ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా... టిక్ టాక్ యాప్ 2017లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.