'టైమ్' మేగజైన్ సంచలనం.. ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్
ప్రఖ్యాత టైమ్ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. సదరు మేగజైన్ కవర్ పేజీ మీద ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగ్యాత్మక కవర్ పేజీ కథనాన్ని అచ్చేసింది.
By: Tupaki Desk | 10 Feb 2025 5:06 AM GMTప్రఖ్యాత టైమ్ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. సదరు మేగజైన్ కవర్ పేజీ మీద ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగ్యాత్మక కవర్ పేజీ కథనాన్ని అచ్చేసింది. ఇందులో భాగంగా వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీసులో టెక్ దిగ్గజం.. ప్రపంచ కుబేరుడు ప్రెసిడెంట్ స్థానంలో కూర్చొన్నట్లు కనిపించటమే కాదు.. ఎరుపు బ్యాక్ గ్రౌండ్ ముఖ చిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఫెడరల్ ప్రభుత్వానని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శ బలంగా ఉంది. ఈ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారన్న అర్థం వచ్చేలా టైమ్ కవర్ పేజీ ఉందని చెప్పాలి. అంతేకాదు.. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్క్ అన్నట్లుగా తన కథనంతో పరోక్షంగా స్పష్టం చేసింది టైమ్. అంతేకాదు.. కవర్ పేజీ స్టోరీలోనూ ఇదే అంశాన్ని గట్టిగా ఎండకట్టింది.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కనిపించటం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాము కొన్ని ప్రశ్నలను వైట్ హౌస్ కు పంపితే.. వాటికి బదులు ఇవ్వటానికి అంగీకరించలేదన్న సదరు మీడియా సంస్థ.. మస్క్ మీద ఈ తరహా కథనాన్ని పబ్లిస్ చేయటం ఇది రెండోసారి కావటం గమనార్హం. గతంలో ఆయన్ను కింగ్ మేకర్ గా పేర్కొంటూ ఒక ఫీచర్ రాసింది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు మస్క్ అన్న విషయాన్ని నేరుగా చెప్పేసింది. ఇలాంటి వ్యాఖ్యలు.. వ్యంగ్యాలు అధ్యక్షుడు ట్రంప్ కు ఎంతలా మంట పుట్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైమ్ మేగజైన్ కవర్ పేజీ కథనంపై ట్రంప్ ను ప్రశ్నిస్తే.. ఆయన లాగి పెట్టి ఒక్కటి ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తోంది. ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించటం చూస్తే.. టైమ్ ఎటకారానికి అంతే స్థాయిలో ట్రంప్ బదులిచ్చారన్న అభిప్రాయం వ్యక్తం కాక మానదు.