టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే... ఏపీలో వార్ వన్ సైడ్ అంట!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి
By: Tupaki Desk | 9 March 2024 5:42 AM GMTఏపీలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇందులో భాగంగా... "సిద్ధం" అంటూ వైసీపీ భారీ ఎత్తున కార్యకర్తల సభలు నిర్వహిస్తుంటే... "జెండా" అంటూ టీడీపీ - జనసేన పార్టీలు ఉమ్మడి బహిరంగ సభలు పెడుతున్నాయి. ఈ సమయంలో సర్వేల సందడీ మొదలైంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకూ విడుదలైన వాటిలో మెజారిటీ సర్వేలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని నొక్కి చెబుతున్నాయి. అయితే మెజారిటీ విషయంలో మాత్రమే నెంబర్స్ మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో... తాజాగా టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సర్వే ఇచ్చిన ఫలితాలు.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్నాయి.
ఇందులో భాగంగా... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే వెల్లడించింది. టీడీపీ - జనసేన కూటమి ప్రభావం అతి స్వల్పం అన్నట్లు తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా ఉన్న 25 పార్లమెంట్ సీట్లలోనూ 21 - 22 సీట్లు వైసీపీ గంపగుత్తగా గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదే సమయంలో టీడీపీ - జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతరులు అనే టాపిక్కే లేదని చెప్పిన ఆసర్వే... ఏపీ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభావం శూన్యం అని వెల్లడించింది. దీంతో... వైసీపీ శ్రేణుల్లో ఈ సర్వే ఫలితాలు సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక సరాసరిన వీటిని అసెంబ్లీ స్థానాలకు కన్వర్ట్ చేసి చూసుకుంటే... 175 స్థానాల్లోనూ వైసీపీకి 147 నుంచి 154 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా... టీడీపీ - జనసేన కూటమికి 21 నుంచి 28 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నమాట!!
టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే: ఏపీ లోక్ సభ ఎన్నికలు - 2024
వైఎస్సార్సీపీ: 21 - 22
టీడీపీ + జనసేన: 3 - 4
ఎన్.డి.ఏ: 0
ఇతరులు: 0