Begin typing your search above and press return to search.

ఏపీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో టైమ్స్ నౌ మాత్రమే ఎందుకిలా?

సమయంలో జాతీయ మీడియా నుంచి ఏపీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి

By:  Tupaki Desk   |   2 Jun 2024 5:28 AM GMT
ఏపీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో టైమ్స్ నౌ మాత్రమే ఎందుకిలా?
X

ఏపీలో శనివారం (జూన్ - 1) సాయంత్రం 6:30 నిమిషాల నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవ్వడం మొదలైంది. ఈ సందర్భంగా కొన్ని సర్వే సంస్థలు ఏపీలో కూటమి గెలుస్తుందని గట్టిగా చెబితే.. మరికొన్ని సర్వే సంస్థలు మళ్లీ జగనే అని నినదించిన పరిస్థితి. ఈ సమయంలో జాతీయ మీడియా నుంచి ఏపీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా ఈ ఫలితాల వల్ల ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు సరికదా.. సరికొత్త కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో టైమ్స్ నౌ సర్వే ఫలితాలు ఆసక్తిగా మారాయి. అందుకు రెండు కారణాలు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లోనూ 24 నుంచి 25 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ మీడియా సంస్థ గతంలో బలంగా చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయానికొచ్చేసరికి.. వైసీపీ 14 స్థానాలకే పరిమితం అవుతుందని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఇంతలోనే ఇంత మార్పుకు గల కారణాలు ఏమిటనే చర్చ మొదలైంది.

దీంతో... పోలింగ్ నాటికి ఏపీలో అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చి ఉంటుంది, అందుకే టైమ్స్ నౌ ఫలితాలు అలా చెప్పి ఉంటుందని కొందరంటే... టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ భాగస్వామి అవ్వడమే అందుకు అసలు కారణం అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ ఒక్క జాతీయ సంస్థే ఏపీలో వైసీపీ ఎంపీ స్థానాల్లో మెజారిటీ సాధిస్తుందని చెప్పడం.

మిగిలిన వాటిలో ప్రధానంగా... ఎన్డీటీవీ, ఏబీపీ సీ-ఓటర్, న్యూస్ - 18, రిపబ్లిక్ - పీమార్క్, జన్ కీ బాత్, ఇండియా టీవీ మొదలైన జాతీయ సంస్థలు ఏపీలో లోక్ సభ స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తాయనే చెప్పాయి. ఒక్క టైమ్స్ నౌ మాత్రం... గతంలో కంటే సీట్లు అనూహ్యంగా తగ్గించి చెప్పినా.. వైసీపీ అధీక్యానికి కట్టుబడి ఉంది!

కాగా.. స్థానిక సంస్థల సర్వె ఫలితాల విషయానికొస్తే... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సగం వైసీపీకి, సగం కూటమికి అనుకూలం అన్నట్లుగా విడిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి నెలకొంది. మధ్యలో మరో రోజు ఆగితే... మంగళవారం ఎగ్జాట్ ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.