Begin typing your search above and press return to search.

టీడీపీకే కోత... జనసేనతోనే వాత!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ అనే సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడించిన విషయాలు చూస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Aug 2023 12:30 AM GMT
టీడీపీకే కోత... జనసేనతోనే వాత!
X

ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంది. నిజానికి విపక్ష పార్టీలు ఎపుడూ అధికార పక్షం ఓట్లను దండీగా రాబట్టుకుంటాయి. కానీ ఏపీలో మాత్రం సాటి విపక్షం ఓట్లకే గండి పడుతోంది. ఇది కూడా 2024లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీడీపీకే చాప కింద నీరు చేరుతోంది అని అంటున్నారు.

జాతీయ సర్వేలు అన్నీ కూడా ఏపీలో మరోసారి వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టం చేస్తున్నాయి. నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ లో వచ్చిన టైమ్స్ నౌ సర్వే ఇదే విషయం చెప్పింది. తాజాగా 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో గల 25 స్థానాలకు గాను 24 స్థానాలు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ అనే సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడించిన విషయాలు చూస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి.

ఈ సర్వే ప్రకారం వైసీపీకి ఓటింగ్ షేర్ బాగా పెరిగింది. ఏకంగా 51 శాతానికి పై దాటింది. అదే సమయంలో టీడీపీకి 2019లో వచ్చిన 40 శాతం ఓటింగ్ నుంచి నాలుగైదు శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అదే సమయంలో 2019 ఎన్నికలలో ఆరేడు శాతం ఓటు బ్యాంక్ ఉన్న జనసేనకు పది శాతం పై దాటి ఓటు షేర్ కనిపిస్తోంది.

అలాగే బీజేపీ ఓటు షేర్ 2019 ఎన్నికలో నోటా కంటే తక్కువగా ఒక శాతం కంటే దిగువగా ఉందేది. ఇపుడు దాదాపుగా రెండు శాతానికి చేరువ అవుతోంది. ఈ ఓట్లు కూడా టీడీపీ నుంచే బదిలీ అవుతున్నాయా అన్న చర్చ అయితే ఉంది.

ఏది ఏమైనా పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని శపధం చేశారు. అయితే వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక కాదు పాజిటివ్ ఓట్లనే ఇపుడు చీల్చాల్సిన అవసరం ఏర్పడింది అని సర్వే నివేదిలకు తెలియచేస్తున్నాయి. బహుశా ఇలాంటి నివేదికలే కాస్తా అటూ ఇటూగా నంబర్లతో విపక్షాలకు చేరి ఉండొచ్చు అని అంటున్నారు.

అందుకే వైసీపీ సంక్షేమ పధకాలను తాము కూడా అమలు చేసి చూపిస్తామని అంటున్నాయి. అంటే వైసీపీ అనుకూల ఓట్లను తీసుకునేందుకే టీడీపీ జనసేన ఇలాంటి కొత్త విషయాలను ప్రకటిస్తున్నాయని అంటున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ పాజిటివ్ ఓటు స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు. ఇక తాజా సర్వే నివేదికలు బట్టి చూస్తే జనసేన టీడీపీ బీజేపీ కలసినా కూడా వైసీపీ ఓటు షేర్ కంటే కూడా మూడు నాలుగు శాతం వెనకబడే ఉన్నాయి.

దీంతో పాటు పొత్తులు కనుక సెట్ అయితే ఈ ఓటింగ్ పెరుగుతుందా లేక ఇంకా తగ్గుతుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. విడివిడిగా ఉన్నపుడు వచ్చిన ఓటింగ్ ఇది కలిస్తే ఓట్ల బదిలీ జరగకపోవచ్చు అన్న సందేహాలు ఎటూ ఉన్నాయి. అదే సమయంలో జనసేనకు ఓటేసిన వారు టీడీపీని ఇష్టపడకపోవచ్చు, టీడీపీ ఓటర్లకు జనసేన నచ్చకపోవచ్చు.

ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మీద వ్యతిరేకత మొత్తం కూటమి మీద పడి ఈ ఓట్ల షేర్ మరింతగా తగ్గినా ఆశ్చర్యం లేదు అన్న కఠిన విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా జనసేన పెరుగుతోంది అని సంబరపడడం కంటే టీడీపీకే కోత పెడుతోంది వాత పెడుతోంది అన్నది పసుపు శిబిరం గ్రహిస్తే మంచిదేమో అన్నట్లుగా తాజా సర్వే నివేదికలు ఉన్నాయని అంటున్నారు.