మళ్లీ అపచారం : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి వెళ్లిన విమానాలు
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంగా గురువారం ఒక్క రోజులోనే ఎనిమిది విమానాలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.
By: Tupaki Desk | 14 March 2025 12:13 PM ISTతిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంగా గురువారం ఒక్క రోజులోనే ఎనిమిది విమానాలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యలో వెళ్లినట్లు గుర్తించారు. ఆగమ శాస్త్రం ప్రకారం, శ్రీవారి ఆలయంపై ఎలాంటి విమాన రాకపోకలు జరగకూడదని నిబంధన ఉంది. కానీ, ఇటీవలి కాలంలో విమానాలు ఆలయ సమీపంగా వెళ్లిన ఘటనలు పెరిగిపోతున్నాయి.
ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పటికే కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఇదే సమస్యపై హోం మంత్రి అనిత స్పందించి, ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయ ఉపరితలంపై విమానాలు ప్రయాణించరాదని, దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
- శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో టోకెన్లు లేకుండా భక్తులు శ్రీవారి సర్వదర్శనం చేసుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజులోనే 51,148 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులలో 21,236 మంది తలనీలాలు సమర్పించారు. అదనంగా, నిన్న హుండీ ద్వారా రూ.3.56 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.