బ్లాక్ లో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు... మహిళా ఎమ్మెల్సీపై కేసు!
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్లు ఎమ్మెల్సీ జకియా ఖానంపై ఆరోపణలు వచ్చాయి.
By: Tupaki Desk | 20 Oct 2024 9:46 AM GMTతిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్లు ఎమ్మెల్సీ జకియా ఖానంపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆరు టిక్కెట్లను రూ.65 వేలకు విక్రయించారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆమె సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్లు భక్తుడు తెలిపాడు.
అవును... మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టిక్కెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు బిజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన టీటీడీ విజిలెన్స్ లో.. ఇందులో వాస్తవం ఉన్నట్లు తేలిందని అంటున్నారు.
దీంతో... ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజతో సహా ముగ్గురిపై కేసు నమోదైంది! ఇందులో భాగంగా.. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఆమె పీఏ లను చేర్చినట్లు తెలుస్తోంది.
ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా జకియా ఖానం వైసీపీ ఎమ్మెల్సీ అని టీడీపీ వారు సంభోదిస్తుంటే.. ఆమె ఇప్పుడు వైసీపీలో లేరని.. ఆ విషయం టీడీపీ నేతలకు కూడా తెలుసని.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలోకి వెళ్లారని తెలిపారు.
ఇదే సమయంలో... ఆమె పలు సందర్భాల్లో మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారని.. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ ని కలుసుకుని చర్చించారని గుర్తుచేశారు! తిరుమలలో వీఐపీ టిక్కెట్లు ఆమె అమ్ముకున్నట్లు వచ్చిన ఆరోపణలతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.