Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌కు శాశ్వ‌త డెయిరీ: చంద్ర‌బాబుకు చ‌క్క‌ని ఛాన్స్‌..!

ఇప్పుడు తిరుమ‌ల‌కు సంబంధించి స‌రికొత్త డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 2:17 PM GMT
తిరుమ‌ల‌కు శాశ్వ‌త డెయిరీ: చంద్ర‌బాబుకు చ‌క్క‌ని ఛాన్స్‌..!
X

మంచో.. చెడో..తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యి క‌ల్తీ అయింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిలో నిజానిజాల‌ను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప‌ని ప్రారంభించ‌నుంది. అయితే.. ఇప్పుడు తిరుమ‌ల‌కు సంబంధించి స‌రికొత్త డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. తిరుమ‌ల శ్రీవారికి సొంతంగా ప్ర‌త్యేక డెయిరీని ఏర్పాటు చేయాల‌ని. దీనిని తొలుత బీసీవై పార్టీ నాయ‌కుడు బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ తెర‌మీదికి తెచ్చారు. తానే స్వ‌యంగా 10 వేల గోవులు ఇస్తాన‌ని.. అదేస‌మ‌యంలో దాత‌ల నుంచి ల‌క్ష గోవుల‌ను సేక‌రిస్తాన‌ని చెప్పారు.

వీటిని తిరుమ‌ల ఆధ్వ‌ర్యంలో పెంచి..పోషించి.. పాలు తీసుకుని..త‌ద్వారా వ‌చ్చే నెయ్యిని శ్రీవారికైంక‌ర్యాల‌కు వినియోగించాలన్న‌ది బోడే సూచ‌న‌. ఇది చ‌క్క‌ని ఆలోచ‌న‌గా సోష‌ల్ మీడియాలోనూ మార్కులు ప‌డుతున్నాయి. మేధావులు కూడా ఇదే చెబుతున్నారు. శ్రీవారి ఆల‌యానికి రాష్ట్రంలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అనేక స్థ‌లాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకుల్లోనూ వంద‌ల కోట్ల రూపాయ‌ల డిపాజిట్లు ఉన్నాయి. ఇక‌, భ‌క్తులు రోజూ ఇచ్చే విరాళాలు.. నెల‌కు వివిధ బ్యాంకుల నుంచి డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీలు అన్నీ క‌లుపుకొంటే ఇవి కూడా వంద‌లు, వేల కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి.

వీటి ద్వారా ల‌క్ష గోవుల‌ను స‌మీక‌రించుకుని.. ప్ర‌త్యేకంగా తిరుమ‌ల శ్రీవారికి డెయిరీ ఫాంను ఏర్పాటు చేస్తే.. త‌ద్వారా.. పాలు పెరుగుతోపాటు నెయ్యిని కూడా తీసుకునేందుకు వెసులు బాటు ఉంటుంది. అయితే.. దీనికి చేయాల్సిన ఏకైక ప‌నిరాష్ట్ర ప్ర‌భు త్వం ఒక తీర్మానం చేసి.. మంత్రివ‌ర్గంలో ఆమోదించుకుని తిరుమ‌ల‌కు పంప‌డ‌మే. ఈ ప‌ని క‌నుక చంద్ర‌బాబు చేయ‌గ‌లిగితే.. తిరుమ‌ల‌కు శాశ్వ‌తంగా ఒక ప్ర‌త్యేక డెయిరీ ఏర్పాటు అవుతుంది. దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మ‌హా అయితే మూడు మాసాల స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు కాంట్రాక్టుల‌ను కొన‌సాగించి.. త‌ర్వాత‌.. తిరుమ‌ల డెయిరీతోనే స‌రుకులు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎన్నెన్నో లాభాలు..

తిరుమ‌ల ప్ర‌త్యేకంగా ఒక డెయిరీని ఏర్పాటు చేసుకుంటే.. ల‌క్ష గోవుల ఆల‌నా పాల‌నా చూసేందుకు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌త‌కు వేలాది మందికి ఉపాధి క‌ల్పించ‌వ‌చ్చు. అదేవిధంగా మినీ డెయిరీల‌ను ఏర్పాటు చేసుకుని తిరుమ‌ల అవ‌స‌రాల‌కు పోగా మిగిలే పాల‌ను విక్ర‌యించుకోవ‌చ్చు. అదేవిధంగా నిత్యం శ్రీవారి భ‌క్తుల‌కు క్యూలైన్లలో ఇచ్చే పాలు, పెరుగన్నం వంటివాటిని కూడా ఈ డెయిరీ నుంచి ఉత్ప‌త్తి అయిన పాలు, పెరుగు నుంచి ఇచ్చే సౌల‌భ్యం ఏర్ప‌డుతుంది.

పైగా నెయ్యి అస‌లు క‌ల్తీ అనే మాటే లేకుండా.. మ‌రింత స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వినియోగించుకునే అవ‌కాశం సొంత‌గానే ఏర్ప‌డుతుంది. దీనికి స‌హ‌క‌రించేందుకు దాత‌లు, మ‌ఠాలు, పీఠాలు కూడా ముందుకు వ‌స్తాయి. పైగా.. చంద్ర‌బాబు హ‌యాంలో శాశ్వ‌త డెయిరీని ఏర్పాటు చేశార‌న్న పేరు చిర‌స్థాయిగా ఉండిపోతుంది. కాబ‌ట్టి.. ఆదిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తే.. పేరుకు పేరు, నాణ్య‌త‌కు నాణ్యత‌, ఉపాధికి ఉపాధి అన్నీ ల‌భిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.