Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్‌ దర్యాప్తు నిలిపివేత

తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 9:28 AM GMT
తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్‌ దర్యాప్తు నిలిపివేత
X

తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణకు నియమించిన సిట్‌ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్‌ దర్యాప్తును రెండు రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తిరుమలలో డీజీపీ ద్వారకాతిరుమలరావు ప్రకటించారు.

కాగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్‌ 30న సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది.

ల్యాబ్‌ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపామని టీటీడీ ఈవో చెప్పారు కదా? ఇదంతా పబ్లిక్‌ డొమైన్‌ లో ఉంది కదా? అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవుని రాజకీయాల్లోకి లాగొద్దని వ్యాఖ్యానించింది. సీఎం రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా.. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్‌ లో ఎందుకు చెప్పారని చంద్రబాబును ప్రశ్నించింది. సిట్‌ ఎందుకు వేశారు? ఇది దర్యాప్తునకు సరిపోతుందా? అని ప్రశ్నించింది.

కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్‌ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్‌ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదన విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ మూడో తేదీకి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రోజుల పాటు సిట్‌ విచారణను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తుందని సమాచారం.