ఏపీ లడ్డూ ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ అంటే...!
ఇది కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. పోరుగున ఉన్న పాకిస్థాన్, చైనాల వరకు కూడా పాకింది.
By: Tupaki Desk | 1 Oct 2024 7:30 PM GMTప్రపంచం ఇప్పుడు కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడేం జరిగినా.. వెంటనే క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతోంది. మారుమూల పల్లెల నుంచి అభివృద్ధి చెందిన నగరాల వరకు కూడా.. క్షణంలో వార్తలు చేరిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. సోషల్ మీడియా. రాజకీయాల నుంచి అనేక విషయాల వరకు సోషల్ మీడియాలో వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పరంపరలో ఇప్పుడు `ఏపీ లడ్డూ` పేరుతో సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నాయి.
ఇది కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. పోరుగున ఉన్న పాకిస్థాన్, చైనాల వరకు కూడా పాకింది. అంతర్జాతీయ మీడియాలోనూ ఏపీ తిరుపతి లడ్డూ ప్రధాన అంశంగా మారిపోయింది. నిజానికి ఏపీలో తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని.. నకిలీ నెయ్యిని వాడారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గత నెల 18 నుంచి సుమారుగా 10 రోజుల పాటు ఈ వార్తలు పెద్ద ఎత్తున జోరందుకున్నాయి. అయితే.. సుప్రీం కోర్టు వ్యాఖ్యల తర్వాత.. ఈ వేడి కొంత మేరకు తగ్గిపోయింది.
కూటమి సర్కారు ఈ విషయాన్ని మౌనంగా గమనిస్తోంది. ఇక, వైసీపీ నాయకులు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత.. తాము సేఫ్ అయిపోయామని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు కూడా మౌనంగానే ఉన్నారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఏపీ లడ్డూ వ్యవహారం వేడి ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతోంది. ఒకవైపు సర్కారు చేసిన ఆరోపణలు, మరోవైపు సిట్ విచారణలు.. ఇంకోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇదేసమయంలో చైనా వంటి పాశ్చాత్య దేశాల్లో అయితే.. తిరుమల లడ్డూలో ఏం కలుపుతారంటూ ప్రత్యేక చర్చలు చేపట్టారు. ఇక, పాకిస్థాన్ అయితే.. మరింత దూకుడుగా వ్యాఖ్యలు చేసింది. దీనిలోనూ తమ పాత్ర ఉందని భారత్ అభియోగాలు చేయదు కదా! అంటూ.. అక్కడి పాత్రికేయులు వ్యంగ్యాస్త్రాలు సంధి స్తున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. దీనిపై నివేదికలు వస్తే తప్ప.. తాము స్పందించేది లేదని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏపీ లడ్డూ ట్రెండ్ కొనసాగుతూనే ఉండడం గమనార్హం.