టీటీడీ పవర్ ఫుల్ డెసిషన్...అయితే రిటైర్ లేకపోతే ట్రాన్స్ ఫర్
అత్యంత పవిత్ర క్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కాని వారు పని చేయడానికి వీలు లేదని లేటెస్ట్ గా బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది
By: Tupaki Desk | 19 Nov 2024 5:26 PM GMTఅత్యంత పవిత్ర క్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కాని వారు పని చేయడానికి వీలు లేదని లేటెస్ట్ గా బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో హిందువులు కాని ఉద్యోగులు తమ జాబ్స్ కి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమో లేక రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ అయినా కావాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిసింది.
ఇక తిరుమల దేవుడు ప్రపంచానికే దేవుడు. ఆయన అత్యంత ధనిక దేవుడుగా హిందూ పుణ్య క్షేత్రాలలో ఉన్నారు. ఇక టీటీడీ సర్వ స్వతంత్ర సంస్థ. టీటీడీలో ఏడు వేల మంది ప్రత్యక్షంగా మరో పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు.
అయితే టీటీడీ తీసుకున్న ఈ డెసిషన్ తో ఏకంగా 300 మంది దాకా పెర్మనెంట్ ఉద్యోగుల మీద ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే టీటీడీ ఉద్యోగ సంఘాలు బోర్డు నిర్ణయానికి మద్దతుగా ఉన్నట్లుగానే ఉంది అంటున్నారు.
తిరుమల పవిత్రత కాపాడుతామని గత నెల 31న టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఆయన ఆనాడు మాట్లాడుతూ, తిరుమల లో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే కావాలని కోరారు. అయితే హిందూయేతర సిబ్బందిని బదిలీ చేయవచ్చా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలా అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని నాయుడు చెప్పారు.
ఇక చూస్తే టీటీడీ ఆలయంలో హిందువులను మాత్రమే నియమించాలని టీటీడీ చట్టంలో ఇప్పటికి మూడుసార్లు సవరించారని అంటున్నారు. ఇది 1989 నాటి ప్రభుత్వ ఉత్తర్వుగా వచ్చింది. ఇలా అన్నీ ఉన్నా తిరుమలలో హిందువులు కాని వారు పనిచేస్తున్నారు అని అంటున్నారు. వారిని గుర్తించారు అని అంటున్నారు.
ఇక ఇటీవల శ్రీవారి ప్రసాదంగా వాడే లడ్డులో నెయ్యి కల్తీ అయిందని ఏకంగా సీఎం హోదాలో చంద్రబాబు ప్రకటించారు ఈ క్రమంలో టీటీడీ బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో హిందువులే ఉండాలని అన్య మతస్థులు ఉండరాదని టీటీడీ కొత్త బోర్డు గట్టిగా తీర్మానించుకుంది. బీఆర్ నాయుడు అయితే హిందూ విశ్వాసానికి, పవిత్రతకు ప్రతీకగా తిరుమల నిలిచిపోయేలా తాను నిబద్ధతతో చెస్తాను అని అంటున్నారు.
అంతే కాదు తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే కావాలని గట్టిగా చెబుతున్నారు. అయితే ఇందులో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పూర్తిగా పరిశీలించాల్సి ఉందని మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయమలో తిరుమలలో పవిత్రత తగ్గిందని కూడా బీఆర్ నాయుడు విమర్శించారు. ఏది ఏమైనా చైర్మన్ గా నాయుడు ఈ విషయం మీద గట్టిగానే ఉన్నారు. ఆయన ఇందులో సక్సెస్ అయితే మాత్రం ఆయన పేరు టీటీడీ చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని చెప్పాల్సి ఉంటుంది.