Begin typing your search above and press return to search.

కల్తీ నెయ్యి కేసు... సిట్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు!

ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంచలన ఆరోపణల నేపథ్యలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ సందర్భంగా.. కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 5:47 AM GMT
కల్తీ నెయ్యి కేసు...  సిట్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు!
X

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్రమైన శ్రీవారి లడ్డు, ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంచలన ఆరోపణల నేపథ్యలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ సందర్భంగా.. కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించింది.

అవును... తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన ట్యాంకర్లలోని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా గతేడాది జూలై 16, 23 తేదీల్లో గుజరాత్ లోని ఎన్.డీ.డీ.బీ. కాఫ్ ల్యాబ్ కు సంబంధించిన ఓ నివేదిక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు తెరపైకి వచ్చాయి.

తిరుమల తిరుపతి దేవస్థానానికి తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి.. ఆ సంస్థ తయారు చేసింది కాదని.. దాన్ని ఉత్తరాఖండ్ లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తీసుకొచ్చారని.. భోలేబాబా డెయిరీ నుంచి ట్యాంకర్లలో తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీకి వచ్చేదని తేల్చిందని అంటున్నారు.

అక్కడ దాన్ని చిన్న ట్యాంకర్లలో నింపి.. ఏఆర్ డెయిరీలోనే తయారుచేసినట్లు సీళ్లు అతికించి.. దానికి తప్పుడు ల్యాబ్ రిపోర్టులు, వారంటీ సర్టిఫికెట్లు జతచేసి టీటీడీకి పంపించేవారని.. ఈ సమయంలో ఏఆర్ డెయిరీ పేరిట భోలేబాబా సరఫర చేసిన నెయ్యి కల్తీదని సిట్ తేల్చిందని తెలుస్తోంది.

గత ఏడాది జూన్ 12, 20, 25 తేదీల్లో ఏఆర్ డెయిరీ పేరిట వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి నాణ్యంగా లేదని టీటీడీ రిజక్ట్ చేయగా.. అవి తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి వెళ్లాల్సి ఉండగా.. తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీకి వెళ్లాయని.. ఏఆర్ డెయిరీ పేరుతో మోసపూరితంగా ఇదంతా నడిపించరని సిట్ తేల్చినట్లు తెలుస్తోంది.

ఎవరీ పోమిల్ జైన్, విపిన్ జైన్?

వాస్తవానికి 2019లో టీటీడీకి భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసేది. ఆ తర్వాత వైష్ణవి డెయిరీతో సంప్రదింపులు జరిపింది. ఇందులో భాగంగా... టీటీడీ టెండర్లలో పాల్గొనాలని, అవసరమైన నెయ్యి తాము సరఫరా చేస్తామని, కిలోకు 2-3 శాతం కమిషన్ ఇస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా కొన్నాళ్లపాటు వైషణవి డెయిరీ పేరుతోనే సారఫరా చేసింది.

ఈ క్రమంలో 2022 జూన్ లో నెయ్యి నాసిరకంగా ఉండటంతో టీటీడీ వాటిని తిరస్కరించింది. అనంతరం అడిగిన నివేదికలేవీ సమర్పించకపోవడంతో ఆ సంస్థపై అనర్హత వేటు వేసింది. అయినప్పటికీ ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి టెండర్లు కోదక్కించు కోవాలనుకున్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్ లు ఈసారి ఏఆర్ డెయిరీ ని సంప్రదించారు.

ఈ సందర్భంగా ఏఆర్ డెయిరీ ఎండీ ఆర్ రాజశేఖరన్ ను సంప్రదించారు. ఈ సందర్భంగా... టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనాలని.. మొత్తం నెయ్యి తామే సరఫరా చేస్తామని.. ఈ క్రమంలో కిలోకు రూ.3 వరకూ కమిషన్ ఇస్తామని ప్రతిపాదించగా.. అందుకు అంగీకరించిన ఏఆర్ డెయిరీ టెండరు వేసింది.

ఈ సమయంలో ఈఎండీలు భోలేబాబా ఖాతాల నుంచి ఏఆర్ డెయిరీ ఖాతాల్లోకి వెళ్లతాగా. ఏఆర్ డెయిరీ తన పేరుతో టీటీడీకి చెల్లించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కొన్నాళ్లుగా పామిల్ జైన్, విపిన్ జైన్ కోసం గాలిస్తుండగా.. వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. కొన్ని నెలలుగా ఇళ్లకు కూడా రావట్లేదని తేలిందని అంటున్నారు. అయితే ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారని అంటున్నారు.